
ఫైల్ ఫోటో
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం కన్నుమూశారు. ఆయన వేకువజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్ సోకడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలు అందిచారు.పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు గత ఏడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు అకాల మృతిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment