వారు అర్చకులు.. బాసర సరస్వతీ సన్నిధిలో చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేస్తూ అమ్మసేవలో తరిస్తుంటారు.
భైంసా, న్యూస్‌లైన్ :వారు అర్చకులు.. బాసర సరస్వతీ సన్నిధిలో చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేస్తూ అమ్మసేవలో తరిస్తుంటారు. అయితే వారి ప్రస్తుత చర్యలు భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారులకు అక్షర శ్రీకారం చుట్టే చేతులే అక్రమాలకు పాల్పడుతున్నాయి. అమ్మసేవలో తరించాల్సిన వారు డబ్బున్న వారి సేవలో తరిస్తున్నారు. అర్చకత్వం మాటున ‘దందాలు’ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్య భక్తులు భక్తితో అమ్మవారికి సమర్పించిన కానుకలను పక్కదారి పట్టిస్తున్నారు. శ్రీకార పూజలు నిర్వహించే అర్చకులు భక్తుల నగదును క్యారీ బ్యాగుల్లో నొక్కేస్తున్నారు. ఈ తతంగాన్ని చిత్రీకరించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ వ్యవహారం సాగుతోంది.
కాసుల పంట
అదో పళ్లెం. సిరులు కురిపించే ఆ అక్షయపాత్ర బాసర సరస్వతీ ఆలయ గర్భగుడిలో కొలువై ఉంది. హుండీలో పట్టనన్ని డబ్బులను పళ్లెం తనలో ఇముడ్చుకుని అర్చకులకు తర‘గని’ ఆస్తిగా భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తారు. ఏ ఆలయంలోనైనా కానుకలను హుండీలో వేసి భగవంతునికి సమర్పించినట్లు భావించి తృప్తిపడతారు. అయితే బాసర సరస్వతీ ఆలయంలో మాత్రం హుండీలు నామమాత్రం. భక్తుల కానుకలు హుండీలో కన్న అర్చకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న అనధికార హుండీలోకే చేరుకుంటాయి. వేలల్లో జీతాలు పొందుతున్న అర్చకులు అమ్మవారి కానుకలకు ఎసరు పెడుతున్నారు. మెత్తం మీద 40 శాతం కానుకలు పక్కదారి పడుతున్నాయి.
నిబంధనలు పక్కదారి
ఆలయ నియమాల మేరకు అర్చకులు అమ్మవారికి సమర్పించిన కానుకలు స్వీకరించరాదు. కేవలం భక్తులు అమ్మవారికి సమర్పించిన బియ్యం నుంచి కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులకు మధుకర భిక్ష నిమిత్తం బియ్యాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్ అనుమతితో తీసుకోవాలి. అయితే అర్చకులు బియ్యంతోపాటు అమ్మవారికి చెందాల్సిన నగదును, ఇతర కానుకలను తీసుకెళ్తున్నారు. హుండీకి సమాంతరంగా అనధికారికంగా ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని భక్తులను తప్పుదోవ పట్టించి హుండీలో వేయాల్సిన కానుకలను తమ పళ్లెంలోకి మళ్లించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హుండీలోనే కానుకలు వేయాలని భక్తులకు „సూచించే బోర్డు రాసిన అధికారులు ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆలయ అర్చకుల ఈ దందాను మామూలుగా తీసుకుని వదిలేస్తున్నారు. ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి చేరుతుండటంతో ఈ విషయంపై ఎవరు నోరు మెదపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలయ హోదాకు అడ్డు
బాసర సర„స్వతీ ఆలయం ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన ఆలయం. వరుసగా మూడేళ్లపాటు ఆలయానికి రూ.5 కోట్ల పైచిలుకు ఆదాయం లభిస్తే ఆలయ స్థాయి డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఆర్‌జేసీ(రీజినల్ జాయింట్ కమిషనర్) స్థాయికి చేరుకుంటుంది. దేవాదాయశాఖలోని ఆర్‌జేసీ స్థాయి అధికారి ఆలయ పర్యవేక్షణ భాధ్యతలను స్వీకరిస్తారు. ఆలయ హోదా పెరిగి ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరుగుతాయి. అయితే అర్చకుల తీరు ఆ హోదాకు అడ్డంకిగా మారింది. భక్తుల నుంచి వస్తున్న ఆదాయంలో 40 శాతం వరకు అర్చకుల జేబుల్లోకి చేరుతుండ టంతో కొన్నేళ్లుగా ఆలయ ఆదాయం స్వల్పగానే పెరుగుతోంది. బాసర సరస్వతీ ఆలయం ఆదాయం పరంగా మిగిలిన దేవాలయాలతో పోలిస్తే చాల వెనకబడి ఉంది. వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయాల సరసన నిలిచే బాసర ఆలయం, ఆదాయపరంగా కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, కొమురవెల్లి, సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయాలతో సమాన హోదా కలిగి ఉంది. ఆలయ అధికారులు దృష్టిసారించి అర్చకుల తతంగాన్ని నిలువరించాలని భక్తులు కోరుతున్నారు.