విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం
- దాతల ప్రోత్సాహానికి సన్నాహాలు
- గరుడ సేవ వేళల్లో మార్పు
- టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
తిరుపతి అర్బన్: టీటీడీ ద్వారా విద్య, వైద్య రంగాల సేవలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్‌మెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సోమవారం తిరుపతిలో ఈవో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ అప్లికేషన్ ద్వారా టీటీడీలోని 9 ట్రస్టులు, ఒక పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 48 గంటల్లోపు డిజిటల్ పాస్‌పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే దాతలుగా వున్న వారు డిజిటల్ పాసుపుస్తకాన్ని పొందవచ్చునన్నారు. దాతల విభాగం ద్వారా కల్పించే దర్శనం, బస తదితర ప్రయోజనాలను ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని వివరించారు.
ఇందులో లోటుపాట్లు ఎదురైతే వాటిని తక్షణం సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ట్రస్టుల సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విజువల్స్ తీయించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరచడం ద్వారా మరింత మంది భక్తులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ-హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు నేరుగా శ్రీవారి హుండీ అకౌంట్‌కు జమ అవుతాయని తెలియజేయాలని పేర్కొన్నారు. పాస్‌పుస్తకాలు అందని దాతలకు మూడు రోజుల్లోపు డిజిటల్ పాస్‌పుస్తకాలను అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ, టీసీఎస్ అధికారులు పాల్గొన్నారు.
గరుడసేవ రాత్రి 7:30కే ప్రారంభం..
భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ సారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించింది. రద్దీని బట్టి రాత్రి 12 నుంచి 12.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించారు. గరుడ వాహనంలో హారతులు తీసుకొచ్చే భక్తుల సంఖ్యను ఈసారి పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.