ఉగాది నాటికి టీటీడీ యాప్
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) త్వరలో శ్రీవారి పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకుగాను టీసీఎస్ సంస్థతో దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యాప్‌ను ఉగాది నాటికి అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు బుధవారం తెలిపారు. తిరుమలలో బస, దర్శనం, సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం, ఈ– హుండీ, ఈ–డొనేషన్, డీమ్యాట్ ఖాతాలతో పాటు భక్తులకు అవసరమయ్యే సేవలు ఈ యాప్‌లో అందుబాటులోకి వస్తాయని వివరించారు. యాప్ అందుబాటులోకి వస్తే టీటీడీ సేవలు భక్తుల చేతుల్లోకి చేరుతాయని, నెట్ సెంటర్లకు వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఇక ఉండదని అన్నారు.
ఇంటర్నెట్ ద్వారా భక్తులకు అందించే సౌకర్యాలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ కోటాలో తిరుమలలోని గదుల సంఖ్యను పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇక కొత్తగా రూ.300 టికెట్లతో పాటే ఒక్కొక్కరు రూ.50 చెల్లించి రెండు లడ్డూలు కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్‌లో రూ.300, రూ.50 సుదర్శనం టికెట్ల కోటాను కూడా త్వరలో పెంచుతామని వెల్లడించారు. 2016లో శ్రీవారికి హుండీ రూపంలో రూ.1,018 కోట్ల ఆదాయం లభించిందని, ఈ–హుండీ ద్వారా నెలకు రూ.కోటి పైబడి విరాళాలను భక్తులు సమర్పిస్తున్నట్లు చెప్పారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్)లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతా సంఖ్య 1601010000384828 ద్వారా షేర్లను సర్టిఫికెట్ల రూపంలో భక్తులు సమర్పిస్తున్నట్లు వివరించారు.