2/3000
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ సమస్యను తల్లిదండ్రులకు తప్ప మరొకరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు ఈ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థినులెవరైనా ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే ఇక్కడ చదువుకోండి.. లేదంటే టీసీ తీసుకెళ్లండి అని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ దుస్థితిపై ఇటు విద్యా శాఖ అధికారులు కానీ, అటు విద్యార్థి సంఘాల నేతలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.
కమలానగర్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సుమారు 850 మంది విద్యార్థినులు చదువుతున్నారు. నాలుగు అంతస్తుల బిల్డింగులో ఈ కళాశాల నడుపుతున్నారు. ఇంతమంది విద్యార్థినులకు ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. నాలుగు అంతస్తుల్లోని అమ్మాయిలు ఈ ఒక్క మరుగుదొడ్డికే వెళ్లాల్సి వస్తోంది.
అనంతపురం ఆర్ట్స్ కళాశాల.. రాష్ట్రంలోనే ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ శివారెడ్డి, ఐఏఎస్ అధికారి సంజీవరెడ్డి తదితరులందరూ ఈ కళాశాలలో చదివిన వారే. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఈ కళాశాలకు ఇంతటి ఘన చరిత్ర ఉంది. ప్రస్తుతం కళాశాలలో దాదాపు 7500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4500 మంది విద్యార్థులు, మూడు వేల మంది విద్యార్థినులు ఉన్నారు. వీరందిరికీ ఉన్న మరుగుదొడ్లు నాలుగంటే నాలుగు. వీటిలో విద్యార్థినులకు కేటాయించింది రెండు మాత్రమే. ఇవి ఎంతమాత్రం సరిపోతాయో.. విద్యార్థినులు ఎలా అవస్థలు పడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : మరుగుదొడ్ల కొరతతో కళాశాల విద్యార్థినుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 71 ఉన్నాయి. ఇందులో 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 58 ప్రైవేట్ కాలేజీలున్నాయి. వీటిలో సుమారు 73,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సోషియల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలు 170 ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 31,752 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,572 మంది ఉన్నారు.
ఆవైపు వెళ్లాలంటే కంపు
ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు, బాత్‌రూములు లేవు. ఉన్నవాటిని శుభ్రం చేసే దిక్కేలేదు. ఆవైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దుర్వాసన భరించలేకపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఎవరితో చెప్పుకోలేక మథనపడుతున్నారు. మగ పిల్లలైతే బహిరంగ ప్రదేశాలకో.. మరోచోటుకో వెళ్తారు.
అమ్మాయిలు ఎక్కడికి పోతారు? అటు అధ్యాపకులకు చెప్పుకోలేక ఇటు సమస్యను అధిగమించలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఇతర సౌకర్యాలు (తరగతి గదులు, ఫర్నీచరు, కంప్యూటరు) కల్పిస్తున్నారు కానీ అతి ముఖ్యమైన మరుగుదొడ్ల నిర్మాణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. 7500 మంది విద్యార్థులున్న ఆర్ట్స్ కళాశాలలో కేవలం నాలుగు మరుగుదొడ్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ కళాశాలల్లో మరీ ఇబ్బందులు
చాలా ప్రైవేట్ కళాశాలలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
వ్యాపార సముదాయాల్లో కళాశాలలు నడుపుతుండడంతో ఆ భవనాల్లో మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు తగినన్ని లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో ఇంటర్వెల్ సమయంలో వందలాది మంది విద్యార్థినులు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. దీనికితోడు నీటి వసతి లేకపోవడంతో భరించలేనంతగా కంపు కొడుతున్నాయి.
ఈ కళాశాలల్లో మరుగుదొడ్లే లేవు
జిల్లాలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరుగుదొడ్లే లేవు. పెనుకొండ, అమడగూరు, చిలమత్తూరు, రామగిరి కళాశాలల్లో మరుగుదొడ్లు లేవని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే వీటిలో పెనుకొండ, చిలమత్తూరు జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తక్కిన మూడు కళాశాలలకు ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు.