రిజర్వేషన్లు ఉన్నా దక్కని ఫలం | Problems to EWS Candidates In JEE | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు ఉన్నా దక్కని ఫలం

Published Thu, May 9 2019 4:39 AM | Last Updated on Thu, May 9 2019 5:29 AM

Problems to EWS Candidates In JEE - Sakshi

సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా.... అన్నట్లుగా మారింది జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)కు హాజరైన ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్స్‌ (ఈడబ్ల్యూఎస్‌) పరిస్థితి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమల్లోకి తెచ్చినా అది వేలాది మంది అర్హులైన విద్యార్థులకు అందకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆయా విద్యా సంస్థలు సరైన రీతిలో ప్రచారం చేయకపోవడమే దీనికి కారణం. దీంతో 2019–20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులకు నిర్వహిస్తున్న ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రం ప్రస్తుత పార్లమెంట్‌ చిట్టచివరి సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. బిల్లు ఆమోదానంతరం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు వీలుగా జాతీయ విద్యా సంస్థల్లో 2 లక్షలకు పైగా సీట్లను పెంచుతూ ఏప్రిల్‌ 15న కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయా విద్యా సంస్థల్లో సీట్ల పెంపుతోపాటు ఈడబ్ల్యూఎస్‌ కింద అర్హుల ఎంపికకు చర్యలు చేపట్టాలి. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్‌ కింద కొత్తగా ఆప్షన్‌ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

జేఈఈలో ఆప్షన్‌కు ఒకే ఒక్కసారి అవకాశం
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)–2019ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండుసార్లు జరిపింది. జేఈఈలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆప్షన్‌ నమోదుకు ఎన్‌టీఏ మార్చి 2న పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. అందులో ఈడబ్ల్యూఎస్‌ కింద అర్హులైనవారు మార్చి 11 నుంచి 15లోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోవాలంటూ గడువు విధించింది. అంటే.. కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. దీనిపై ఎలాంటి ప్రచారమూ లేకపోవడం, వేలాది మంది విద్యార్థులు పబ్లిక్‌ నోట్‌ను గమనించకపోవడంతో ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయారు.

విద్యార్థులు ఆప్షన్‌ నమోదు చేసి ఉంటే సంబంధిత ధ్రువపత్రాలను జేఈఈ మెయిన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాత్రం సంబంధిత పోర్టల్‌లో ఆ ధ్రువపత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా మెయిన్‌ పరీక్ష సమయంలోనే ఆప్షన్‌ నమోదు చేయడంపై సరైన ప్రచారం కల్పించలేదు. ఆప్షన్‌ నమోదుకు ఒకటికి రెండుసార్లు విద్యార్థులకు గడువు ప్రకటించాల్సి ఉన్నా అదీ చేయలేదు. దీంతో అసలు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాల సమయంలో అమల్లోకి వచ్చాయన్న అంశం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది.

ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ చూసి అవాక్కు
కాగా.. జేఈఈ మెయిన్‌ పేపర్‌–1 ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ర్యాంకులు స్కోరులను కూడా వెల్లడించింది. రెండు దశ (జనవరి, ఏప్రిల్‌)ల్లో బీఈ/బీటెక్‌కు సంబంధించిన పేపర్‌–1కు 9,35,741 మంది, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సులకు సంబంధించిన పేపర్‌–2కు 1,69,767 మంది హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 60 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారని అంచనా. ఏపీ, తెలంగాణ కలిపి 1.50 లక్షల మంది విద్యార్థులు మెయిన్‌ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించినవారిలో మెరిట్‌లో ఉన్న తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఎంపిక చేశారు.

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అవసరమైన కటాఫ్‌ ఎన్‌టీఏ స్కోర్లను కూడా ప్రకటించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 89.7548849,  ఈడబ్ల్యూఎస్‌ (జనరల్‌లో ఆర్థికంగా వెనుకబడినవారు)కు 78.2174869, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 74.3166557, ఎస్సీలకు 54.0128155, ఎస్టీలకు 44.3345172 కటాఫ్‌ స్కోర్లుగా నిర్దేశించారు. ఈ స్కోర్లు సాధించిన విద్యార్థులకు మే 27న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా చూసిన విద్యార్థులు అవాక్కయ్యారు.ఈడబ్ల్యూఎస్‌ కోటా గురించి తాము ముందుగా చూసుకోలేకపోయామని, సరైన ప్రచారమూ లేనందున ఎన్‌టీఏ ఇచ్చిన గడువులోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయామని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

స్పందించని ఎన్‌టీఏ
తమకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలు వచ్చిన వెంటనే మీడియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. జేఈఈ నిర్వహించేది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌టీఏ కాబట్టి తామేమీ చేయలేమని రాష్ట్ర అధికారులు చేతులెత్తేశారు. పైగా ఎన్నికల హడావిడిలో ఉన్నందున దీనిపై దృష్టిపెట్టే పరిస్థితి కూడా అధికారులకు లేకుండా పోయింది. ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ నమోదుకు గడువు ఇస్తూ ఎన్‌టీఏ గతంలో విడుదల చేసిన నోటీసులోని ఫోన్‌ నెంబర్లను, ఈమెయిళ్లను సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఆప్షన్‌ నమోదుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తమకు వచ్చిన స్కోరు, ర్యాంకు ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. దీనిపై ఎన్‌టీఏ నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా నష్టపోయే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.

అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది.  విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్‌ కింద కొత్తగా ఆప్షన్‌ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement