ఐటీఐ పరీక్ష ఆగమాగం | problems occured in iti exam | Sakshi
Sakshi News home page

ఐటీఐ పరీక్ష ఆగమాగం

Published Wed, Feb 26 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

problems occured in iti exam

 ప్రశ్నపత్రాల కొరతతో పక్కకేంద్రాలకు పరుగులు
 జిరాక్స్ కోసం కేంద్రం దాటిన ప్రశ్నపత్రాలు..
 సెమిస్టర్‌పై అవగాహన కల్పించని నిర్వాహకులు
 హాల్‌టికెట్‌ల కోసం సెంటర్ల వద్దే బేరసారాలు
 
 భద్రాచలం, న్యూస్‌లైన్:    
 ఐటీఐ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంపై ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు సరైన అవగాహన కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానం ఆదిలోనే అభాసుపాలైంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి ఐటీఐ పరీక్షలు ప్రారంభయ్యాయి. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న క్రాంతి ఐటీఐ, శ్రీ రామ, పవన్ ఐటీఐల విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు.
 
  భాగ్యలక్ష్మి, సారపాకలోని రామభద్ర ఐటీఐ విద్యార్థులు పాలిటె క్నిక్ కళాశాలలో పరీక్ష రాశారు. సెమిస్టర్ విధానంలో భాగంగా రెండు రోజులు రెండేసి పేపర్ల చొప్పున ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్, వైర్‌మన్, కోపా, డీఎం సివిల్ తదితర ట్రేడ్‌లకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్షలు ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ షీట్‌లో సర్కిల్స్‌ను దిద్దేందుకు బ్లాక్‌బాల్ పాయింట్ పెన్నునే ఉపయోగించాలనే నిబంధన విధించారు. ఇన్విజిలేటర్ సూచించినా పలువురు విద్యార్థులు దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాలామంది బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను తీసుకురాలేదు. నిర్వాహకులు అప్పటికప్పుడు బయటినుంచి తెప్పించి ఇచ్చారు. సెమిస్టర్ విధానంపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఇన్విజిలేటర్లు అన్నారు.
 
 కేంద్రాల వద్దే హాల్‌టికెట్ల పంపిణీ
 భద్రాచలంలో పలు ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు కేవలం ఫీజుల కోసమే విద్యార్థులను కాలేజీలో చేర్పించుకుంటున్నట్లు మంగళవారం ప్రత్యక్షంగా రుజువైంది. పరీక్షకేంద్రాల వద్దే కొన్ని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే హాల్‌టికెట్లు ఇచ్చారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు కేవలం కళాశాలల తనిఖీ, పరీక్షల సమయంలోనే కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ముందస్తు ఒప్పందంలో భాగంగానే నిర్వాహకులు ఇలా చేస్తుంటారని విద్యార్థులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పరీక్షల ముందురోజు నాటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వాల్సి ఉండగా..ఫీజుల కోసం కొన్ని కళాశాలల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో బేరసారాలు ఆడుతూ కనిపించారు. అప్పటికప్పుడు ఎంతోకొంత ఇచ్చినవారికే హాల్‌టికెట్లు అందజేశారు.
 
 ప్రశ్నపత్రాల కొరతతోఇన్విజిలేటర్ల పరుగులు
 ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్ ప్రశ్నపత్రాలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాకపోవడంతో ఇన్విజిలేటర్లు వాటికోసం పరుగులుతీయాల్సి వచ్చింది. పక్క పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రశ్నపత్రాలను తెచ్చారు. ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు అసలే రాకపోవడంతో ఆ విభాగం విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో రెండుసెంటర్లలో గైర్హాజరైన విద్యార్థుల ప్రశ్నపత్రాలను వీరికి అందజేశారు. ఇలా సర్దుబాటు చేసినా పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విభాగం పేపర్‌లు 37 తక్కువ రావడంతో...ఓ పేపర్ తీసుకెళ్లి జిరాక్స్ తీయించి విద్యార్థులకు పంపిణీ చేశారు.
 
 డిగ్రీ కళాశాలలో డిక్టేషన్..?
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నిర్వాహకులతో ముందస్తు ఒప్పందం నేపథ్యంలో విద్యార్థులకు జవాబులు డిక్టేట్ చేసినట్లు తెలిసింది. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా చెప్పుకునే ఓ వ్యక్తికి ప్రైవేటు ఐటీఐ కళాశాలల నిర్వాహకులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందు ఐటీఐ నిర్వాహకుల వాహనంలోనే సదరు అధ్యాపకుడు నేరుగా కేంద్రంలోకి రావటం గమనార్హం.
 పేపర్లు ఆసల్యంగా రావటంతోనే సమస్య: ఎం. మురళీకృష్ణ, పరిశీలకులు
 ప్రశ్నపత్రాలు ఆలస్యంగా వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాయి. మంగళవారం ఉదయం వెళ్లి తెచ్చుకున్నాం. పేపర్లు తక్కువగా వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. గైర్హాజరైన విద్యార్థుల పేపర్లు సర్దుబాటు చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement