పింఛను పాట్లు
కొవ్వూరు/పెరవలి/నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం వృద్ధులతోపాటు వికలాంగులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. వృద్ధుల్లో కొందరి వేళ్లపై ముద్రలు అరిగిపోవడంతో రెండు నెలలుగా వారికి పింఛన్లు అందటం లేదు. బయోమెట్రిక్ మెషిన్‌పై వేలిముద్ర వేస్తే తప్ప పింఛను ఇచ్చే అవకాశం లేదని వెనక్కి పంపించేస్తున్నారు.
ఈ కారణంగా జిల్లాలో సుమారు 15వేల మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలోను కనీసం 10 మంది వృద్ధులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 830 మంది వేలిముద్రలు బయోమెట్రిక్ మెషిన్‌పై పడకపోవడం వల్ల పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను తీసుకోకపోతే రద్దు చేసే పరిస్థితి ఉండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వికలాంగుల్లోనూ కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.
నేటికీ పూర్తికాని వేలిముద్రల సేకరణ
పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చి మూడు నెలలు కావస్తోంది. నేటికీ లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. దీనివల్ల ఈ నెలలో కొవ్వూరు మండలంలో 322 మందికి, చాగల్లు మండలంలో 205 మందికి, తాళ్లపూడి మండలంలో 203 మందికి, కొవ్వూరు మునిసిపాలిటీలో సుమారు 100 మందికి పింఛన్లు అందలేదు. గత నెలలో నియోజకవర్గంలో సుమారు 3,700 మందికి పింఛన్లు అందలేదు. బయోమెట్రిక్ మెషిన్‌లో వేలిముద్రలు సక్రమంగా నమోదు కాలేదని కొందరికి.. సొమ్ములు విడుదల కాకపోవడంతో మరికొందరికి పింఛను సొమ్ము ఇవ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది.
అనంతరం ఫినో సంస్థ ద్వారా పింఛన్లు బట్వాడా చేసేవారు. అనంతరం ఆరునెలలపాటు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇచ్చారు. రెండు నెలల క్రితం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇక్కడ నుంచే ఫించను లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియను ముగించనున్నారు. ఈ ఏడాది వరుసగా రెండుసార్లు పంపిణీ విధానాలు మార్చడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు మొదలయ్యూరుు.
నాలుగు నెలలుగా ఇవ్వట్లేదు
ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛను నాకెంతో ఆసరాగా ఉండేది. నాలుగు నెలలుగా పింఛను డబ్బు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. వేలిముద్రలు పడకపోవడంతో రోజూ మునిసిపల్ కార్యాలయూనికి వెళ్లి గంటల తరబడి వేచివుంటున్నాను. అరుునా ప్రయోజనం లేదు. ఈ విధానాన్ని మార్చి పాత పద్ధతిలోనే పింఛను ఇప్పించాలి.- బందెల పవన్‌శేఖర్, కొవ్వూరు
ఇంకు ముద్ర తీసుకోవాలి
బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా పింఛను ఇవ్వటం లేదయ్యా. గతంలో ఇంకు ముద్ర నొక్కించుకుని పింఛను ఇచ్చేవారు. ఈమధ్య కాలంలోనే ఫించన్ కోసం తిప్పలు పెడుతున్నారు. డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. వచ్చే రెండొందలు మందు బిళ్లల ఖర్చుకు ఉపయోగపడేది.
- మజ్జి అన్నపూర్ణ, నరసాపురం
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా
బయోమెట్రిక్ విధానం వల్ల 3 నెలలుగా పింఛను రావడం లేదు. వేలిముద్రలు పడలేదని పింఛను సొమ్ము ఇవ్వడం లేదు. నలుగురు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్న నాకు వితంతు పింఛను ఎంతో ఆసరాగా ఉండేది. చిన్న పిల్లలు కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాను. అధికారులు పాత పద్ధతిలోనే పింఛను ఇచ్చే ఏర్పాటు చేయాలి.
- కవల భారతి, కొవ్వూరు