
నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు
- సీఎం చంద్రబాబు
- సమస్య పరిష్కరించాలని కేంద్రానికి లేఖ
సాక్షి, అమరావతి: నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిలో నిరసన వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రూ.1000, 500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో ప్రవేశపెట్టిన నోట్లు అందుబాటులోకి సరిగా రాకపోవటం వల్ల చిన్న వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్యూ లైన్లలో నిలబడ్డ దివ్యాంగులు, మహిళలు, వృద్ధులను చూస్తే బాధ కలుగుతోందన్నారు. వారికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని నోట్ల మార్పిడి సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్టు శుక్రవారం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాకు వివరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్‌స ద్వారా పెద్దనోట్ల తాజా పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం విడుదల చేసిన రూ.2000 నోట్లు వల్ల చిన్న వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని సీఎం చెప్పారు. రూ.2000 నోటు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఓటు రేటు రూ.2000కు పెరిగే అవకాశం లేకపోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ నోటు విడుదల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. అవినీతిపరులకు, అక్రమార్కులకు ఎక్కువగా ఉపయోగపడే ఈ నోటు శాశ్వతంగా ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు.
ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రోత్సాహకాలివ్వాలి
ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించే వారిపై విధించే యూజర్ చార్జీలను రద్దు చేయడమే కాకుండా వారికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 80 శాతం సబ్సిడీతో ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేయాలన్నారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల చిన్న నోట్లు విడుదల చేయాలని కోరారు. సహకార బ్యాంకుల బకారుులను రైతులు చెల్లించేటప్పుడు పాత నోట్లకు అనుమతి ఇచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్, గ్యాస్ తదితర అత్యవసర సర్వీసుల్లో ఇచ్చిన మినహారుుంపులు ఇతర ప్రాధాన్యతా రంగాలకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఆర్‌బీఐ ఏపీని ఒక బ్రాంచిగా కాకుండా ఫ్రధాన రాష్ట్రంగా భావించాలని, ఆర్‌బీఐ అధికారులు అమరావతికి వచ్చి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలోని 29 వేల చౌకధరల దుకాణాలను డిసెంబరు నుంచి విలేజ్ మాల్స్‌గా మార్చుతున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ’అన్న క్యాంటీన్లు’
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వెంటనే ’అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ... అన్న క్యాంటీన్లను ముందుగా నగరాలు, పట్టణాల్లో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రేషన్ షాపులను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్పు చేసి నిత్యావసర వస్తువులు అన్నీ అక్కడే లభించేలా చూడాలన్నారు.