'ఎక్కువ డబ్బుంటే వేరే వారి అకౌంట్లలో వేస్తారు'
విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే అంశంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా వాళ్ల అకౌంట్లలో ఎక్కువ డబ్బు ఎందుకేస్తారని ప్రశ్నించారు. ఒక వేళ ఎక్కువ డబ్బుంటే వేరే వాళ్ల అకౌంట్లలో వేస్తారని అది పెద్ద విషయమే కాదన్నారు. బీజేపీ ఎంపీల అకౌంట్ల బహిర్గతంపై ఆయన ఈ విధంగా స్పందించారు.
పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పడిందని వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించాయని చంద్రబాబు అన్నారు. డిసెంబర్ 1 నాటికి పెద్ద ఎత్తున చెల్లింపులు జరగాల్సి ఉందని కానీ, బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆన్లైన్లో చెల్లిస్తామని బాబు చెప్పారు. రేషన్ షాపుల్లో నాలుగు రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తానమన్నారు. ఏపీలో కోటి 12 లక్షల మంది నగదు మార్పిడి చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ముఖ్యమంత్రులతో సబ్ కమిటీ వేస్తామని సోమవారం చెప్పిందన్నారు. దీనిపై కేంద్రం తన అభిప్రాయం అడిగిందని...ఇంకా ఏం చెప్పలేదన్నారు.