
ఎన్నికల్లో నోట్లు పంచబోమనే దమ్ముందా?
బాబుకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మా అభ్యర్థులెవరూ పెద్దనోట్లు పంచరని, నోట్లు పంచితే చెప్పుతో కొట్టండని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తెల్లారి లేస్తే.. నీతి, నిజారుుతీ, నిప్పులాంటి వాడ్ని అంటూ నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రూ.2000లు, రూ.1000 నోట్లను పంచబోమని చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుల జోడి భారతదేశాన్ని బోడి చేస్తోందని ధ్వజమెత్తారు. వీరి జోడి గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు. కానీ దేశంలో మహావృక్షంలా ఎదిగిన మోదీకి చంద్రబాబు సలహా వల్ల దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ తాను కొన్నిరోజుల ముందు ప్రధానికికి లేఖ రాశానని అప్పట్లో చంద్రబాబు చెప్పకొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి చంద్రబాబు ఆద్యుడని, అందువల్ల ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నోట్ల సమస్య పరిష్కారంపై కమిటీ వేయాలని, దానికి చంద్రబాబు కన్వీనర్‌గా, రంగరాజన్, దువ్వూరి సుబ్బారావు, మన్మోహన్ సింగ్, కేవీరెడ్డి వంటి వారిని నియమించాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా లోకేష్‌ను నియమించాలని గాలి కోరనందుకు సంతోషమని ఎద్దేవా చేశారు.
అక్రమ సంపాదనతో హెరిటేజ్ ఎదుగుదల
అక్రమ సంపాదన పెట్టుబడిగా పెట్టిన చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడం వల్లే హెరిటేజ్ షేర్ విలువ విపరీతంగా పెరిగిపోరుుందని.. నోట్ల రద్దు విషయం ముందే తెలియడంతో హెరిటేజ్‌లో పెట్టి నల్లధనాన్ని వైట్ చేసుకున్నారని అంబటి విమర్శించారు. 2012 మేలో కేవలం రూ.66.58లు ఉన్న హెరిటేజ్ షేర్ ధర 2014కి రూ.199లకు పెరిగిందన్నారు. అది 2016 అక్టోబరు నాటికి ఏకంగా రూ.909లకు ఎలా పెరిగిందో వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెరిటేజ్ అధికార ప్రతినిధిలా వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులెవరూ పెద్దనోట్లు పంచరని, నోట్లు పంచితే చెప్పుతో కొట్టండని చెప్పే దమ్మూ, ధైర్యం బాబుకుందా? అని ప్రశ్నిం చారు. కరెన్సీ కష్టాలు ఉన్నప్పడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన గుర్తు చేశారు.