ఆ ఇద్దరి జోడీ.. దేశానికి బోడి!
చంద్రబాబు.. నరేంద్ర మోదీల జోడీ గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు గానీ, ఇప్పుడు వాళ్ల జోడీ దేశానికి బోడిగా మారిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యేలా ఉంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని చెప్పారు.
పెద్ద నోట్లు రద్దు చేయాలన్న సలహా తానే ఇచ్చానని చంద్రబాబు చెప్పారని, నల్లధనాన్ని అరికట్టాలంటే ఈ నోట్లను రద్దు చేయాలంటూ తాను కొన్ని రోజుల ముందు ప్రధానమంత్రికి లేఖ రాశానని అప్పట్లో చంద్రబాబు చెప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట మారుస్తున్నారని.. ఈ నిర్ణయం వెనుక నిజంగా చంద్రబాబు ఉంటే.. ఆయన దేశప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అసలు డబ్బు పంచబోమని చంద్రబాబు ప్రకటించగలరా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాంత్వన కలిగించేందుకు ఏం చర్యలు చేపడుతున్నారో చంద్రబాబు చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు.