పాలకుండలో నష్టాల పొంగు | profits of dairy farmers, dairy farms tedious | Sakshi
Sakshi News home page

పాలకుండలో నష్టాల పొంగు

Published Tue, Jul 29 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

పాలకుండలో నష్టాల పొంగు

పాలకుండలో నష్టాల పొంగు

  •      పాడి రైతుల కష్టంతో డెయిరీలకు లాభాలు
  •      పాల సేకరణ ధర పెంచని యాజమాన్యాలు
  •      ఏటా రెండుసార్లు పాల పదార్థాల ధర పెంపు
  •      తరచూ దాణా ధరల పెంపుతో రైతుల ఆందోళన
  • పంట కలిసి రాకపోతేనేం... పాడి ఆదుకుంటుందని ఆశపడ్డారు. అష్టకష్టాలు పడి పశువులను పెంచుతున్నారు. ఎంత శ్రమించినా గిట్టుబాటు కాక విలవిల్లాడుతున్నారు. రైతుల కష్టంతో డెయిరీలు లాభాలార్జిస్తున్నాయి. పాల సేకరణ ధరను పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పశుగ్రాసం దొరక్క రైతాంగం అవస్థలు పడుతోంది. డెయిరీలు దాణా ధరను తరచూ పెంచుతుండటంతో నష్టాల బాట పడుతోంది.
     
    యలమంచిలి/యలమంచిలి రూరల్: జిల్లాలో పాడి పరిశ్రమకు కష్టకాలం దాపురించింది. పాడిపశువుల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. పెరుగుతున్న దాణా ధరలు, అందుబాటులో లేని పశుగ్రాసంతో అన్నదాతలు పశువుల పెంపకంలో అష్టకష్టాలు పడుతున్నారు. దాణా ధరలు పెంచడంలో డెయిరీలు బహిరంగ మార్కెట్‌తో పోటీ పడుతున్నాయి. విశాఖ డెయిరీతోపాటు హెరిటేజ్, సుప్రజ, తిరుమల తదితర ప్రయివేట్ డెయిరీల ద్వారా పాలసేకరణ కేంద్రాల్లో పాలకు సరైన ధర లభించడం లేదు. మినీ డెయిరీలు, పాడిపశువుల పెంపకంపై అందరు ఆసక్తి చూపించేవారు. నిరుద్యోగులకు పాడి పరిశ్రమ ఉపాధి అవకాశంగా ఉండేది. ప్రస్తుతం పాల డెయిరీలు చెల్లిస్తున్న ధరలతో మినీ డెయిరీలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా డెయిరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్న పాల పదార్థాల ధరలను ఏడాదికి రెండుమూడు సార్లు పెంచేస్తున్న యాజమాన్యాలు రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు ధర పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డెయిరీ యాజమాన్యాలు పాలకు గిట్టుబాటు ధరను చెల్లించడం లేదని రైతులు యాజమాన్యాలను కూడా నిలదీస్తున్నారు.
     
    పాల ఉత్పత్తి వ్యయం బోలెడు

    పూటకు 2 లీటర్ల పాలిచ్చే పశువుకు రోజుకు సుమారు 2 కేజీల దాణా పెట్టాలి. పచ్చగడ్డి లేదంటే అందుబాటులో ఉన్నట్టయితే ఎండు గడ్డిని పెట్టాలి. రోజుకు 4 లీటర్ల పాలకు 8.0 వెన్న శాతం వస్తే లీటరుకు రూ.37 వరకు డెయిరీలు చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన 4 లీటర్లకు రూ.148 వస్తే దాణాకు సుమారుగా రూ.60 ఖర్చవుతుంది. రైతుకు రోజు కూలీ ద్వారా వచ్చే ఆదాయం రూ.200 నుంచి రు.250లు. దీంతో పాడిపశువులను మేపుతున్న రైతులు రోజుకు రూ.100 నుంచి రూ.150ల వరకు నష్టపోవలసి వస్తోంది.
     
    క్షీణిస్తున్న వెన్న శాతం
     
    ప్రస్తుతం దాణా, పశుగ్రాసం కొరత వల్ల వెన్నశాతం కూడా తక్కువగానే ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పాలసేకరణ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలలో వెన్నశాతం 6 నుంచి 8 శాతం వరకు మాత్రమే ఉంటోంది. పది శాతం వెన్న ఉన్నట్టయితే డెయిరీలు లీటరు గేదె పాలకు రూ.43 చెల్లిస్తున్నాయి. వెన్నశాతం లేకపోవడంతో రైతులు నష్టాలు చవిచూడవలసి వస్తోంది.  
     
    గిట్టుబాటు చెల్లిస్తేనే
     
    జిల్లాలో చాలా కుటుంబాలు పాడిపశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. విశాఖ డెయిరీతోపాటు ప్రయివేటు డెయిరీల ద్వారా రోజుకు 8 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. విశాఖ డెయిరీ మాత్రం గుడ్డిలో మెల్లగా (ప్రయివేటు డెయిరీలతో పోటీ ఉన్న గ్రామాల్లో) రూ.2 నుంచి రూ.3 వరకు అదనంగా చెల్లిస్తోంది. ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోవడంతో లీటరు గేదె పాలకు రూ.70, ఆవుపాలకు రూ.40 చెల్లిస్తేనే గిట్టుబాటువుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
     
    దంపతుల రోజు ఆదాయం రూ.50
     
    అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లపు వెంకట ఆదిబాబుకు రెండు ఆవులున్నాయి. ఏడాది పొడవున సరాసరి రోజుకు 8 లీటర్ల  పాలు పోస్తున్నాడు. ఏడాదిలో ఈయనకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. దాణా, మందులు, గడ్డికి 30 శాతం ఖర్చవుతుంది. రైతుకు మిగిలింది ఏటా రూ.30 వేలే. నెలకు రూ.1500 గిట్టుబాటవుతుంది. అంటే రోజుకు రూ.50 ఆదాయం వస్తుందన్నమాట. ఉదయం నుంచి రాత్రివరకూ రెండు ఆవులతో ఆదిబాబు, ఆయన భార్య పనిచేస్తారు. కూలి గిట్టుబాటు కాలేదని ఆదిబాబు వాపోతున్నాడు.
     
    దడ పుట్టిస్తున్న దాణా ధర
     
    మార్కెట్‌లో పెరుగుతున్న దాణా ధరలతో పాడిరైతులు మరింత నష్టపోవలసి వస్తోంది. విశాఖ డెయిరీ ద్వారా 50 కేజీల దాణాను రూ.550కి సరఫరా చేస్తున్నారు. అయిదు నెలల క్రితం దాణా ధర రూ.500 ఉండేది. ఇక మార్కెట్‌లో ఏడాది క్రితం వరకు రూ.350 ఉన్న తౌడు బస్తా ధర రూ.450కు చేరింది. వరిగడ్డి అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టరు ఎండుగడ్డిని రూ.6 వేల నుంచి రూ.7వేల వరకు కొలుగోలు చేస్తున్నారు.
     
    నీళ్ల ధర భేష్
     
    మార్కెట్‌లో లీటర్ మంచినీళ్ల సీసా ధర రూ.20లు, మంచినీళ్ల ప్యాకెట్ ధర రూ.2. నీరు ఉచితంగా వచ్చేదే. నీటిని శుద్ధి చేసేందుకు, బాటిల్, ప్యాకింగ్ తదితర ఖర్చు రూ.5 నుంచి రూ.6. రిటైల్ వ్యాపారులు లీటరు సీసాను రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని రూ.20కి వినియోగదారులకు అమ్ముతున్నారు.
     
    కూలికెళ్తే రూ.250...పాలు పోస్తే రూ.40
     
    అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేటకు చెందిన జగన్నాథరావుకు ఆవు, గేదెలున్నాయి. జగన్నాథరావు డెయిరీకి ఏడాది పొడవున సరాసరి లెక్కవేస్తే 4 లీటర్ల పాలు పోస్తున్నాడు. ఏడాదికి జగన్నాథరావుకి రూ.25 వేలు చెల్లిస్తారు. దాణా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు అవుతుంది. జగన్నాథరావుకు మిగిలేది రూ.15 వేలే. నెలకు రూ.1250 మిగులుతుంది. అంటే రోజుకు రూ.40 గిట్టుబాటవుతుంది. రాత్రింబవళ్లు పశువులను కనిపెట్టుకుని ఉండాలి. కూలికి పోతే రోజుకు రూ.250 ఇస్తున్నారు. పాడి గిట్టుబాటు కావడం లేదని జగన్నాథరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement