
కష్టపడే వారికి సముచిత స్థానం
కాకినాడ :కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని త్రిసభ్య కమిటీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటీవల రాష్ట్ర కమిటీలో కొత్తగా నియమితులైన పలువురు నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక సూర్యకళా మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావును సత్కరించారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన పాత్ర వహిస్తున్న పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్నికి కూడా కండువా కప్పి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత చురుగ్గా పనిచేయాలని వీరికి సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ.. నిత్యం ప్రజలకు అండగా నిలవాలని కోరారు. పార్టీపై అంకితభావంతో పనిచేస్తే ఎల్లప్పుడు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, ఇటీవల ఎన్నికల్లో కూడా బాగా పనిచేసిన వారిని గుర్తించి పదవుల్లో నియమించారన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రతిష్ట కోసం పనిచేసే వారిని గుర్తించి జిల్లా కమిటీల్లో నియమిస్తామన్నారు.
రావూరి పుట్టిన రోజు వేడుక
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ జిల్లా ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు రావూరికి కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. పార్టీ నాయకుడు అత్తిలి సీతారామస్వామి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు ప్రచార కన్వీనర్‌గా రావూరి వెంకటేశ్వరరావు సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు. అక్కడకు వచ్చిన పార్టీ రాష్ట్ర నేతలు, నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు,. కార్యకర్తలు కూడా రావూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.