
ప్రోగ్రెస్ రిపోర్‌ట
- జిల్లాలో కాగిత ఫస్ట్
- నందిగామ లాస్ట్
- మూడో స్థానంలో నిలిచిన గద్దె రామ్మోహన్
- ఆరో స్థానంతో సరిపెట్టుకున్న బొండా ఉమా
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్‌చార్జులకు ఈ సందర్భంగా ఈ ర్యాంకులను సీల్డ్ కవర్‌లో అందజేశారు.
నగరంలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ రాష్ట్ర సమావేశం శనివారం జరిగింది. సమావేశం ముగింపు సమయంలో చంద్రబాబు ఆదేశాలతో అందరికీ సీల్డు కవర్లు అందాయి. దీంతో ఎమ్మెల్యేలందరిలో ఒక్కసారిగా ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తాయి. ఇంతలోనే వారి ఆలోచనలకు తెరదించుతూ.. ‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నిర్వహించి ర్యాంకులు ఇచ్చాం. మీకు వచ్చిన ర్యాంకులు చూసుకోండి’ అని బదులిచ్చి సమావేశం ముగిం చారు. దీంతో తమకు ఏ ర్యాంకు కేటాయించారా అని చాలామంది ఆసక్తిగా చూసుకున్నారు.
టాప్ ర్యాంకులు ఇవే..
జిల్లాలో పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలకు, ఐదుగురు టీడీపీ ఇన్‌చార్జిలకు ముఖ్యమంత్రి ర్యాం కులు ఇచ్చారు. జన్మభూమి, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలతో ఎమ్మెల్యే మమేకం అవుతున్న తీరు, నిత్యం ప్రజలతో కొనసాగిస్తున్న సంబంధాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని అంశాలవారీగా, వ్యక్తిగతంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ ర్యాంకుల్లో జిల్లాలో మొదటిస్థానంలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, రెండోస్థానంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మూడో స్థానంలో ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్, నాలుగో స్థానంలో మైలవరం ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఐదో స్థానంలో పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య, ఆరో స్థానంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.
చివరి రెండు స్థానాలైన 15, 16 స్థానాల్లో తిరువూరు ఇన్‌చార్జి స్వామిదాసు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉన్నారు. 12వ స్థానంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, 13వ స్థానంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ స్థానానికి మొదటి ర్యాంక్ దక్కినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దిశానిర్దేశం
టీడీపీ రాష్ట్ర సమావేశం నగరంలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశం, కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సుదీర్ఘ చర్చ జరిగింది. నదులను అనుసంధానం చేయటం, పట్టిసీమ ప్రాజెక్ట్, పోలవరం, రైల్వే జోన్ల అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై చర్చ సాగింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై నిర్వహించిన సర్వే ఆధారంగా చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇలా అనేక అంశాలపై చర్చ సాగింది.
అంశాలవారీగా ప్రభుత్వ పథకాల్లోని లోపాలు, ఇతర అంశాలపైనా ఈ సందర్భంగా చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులను కలుపుకొని పనిచేయాలని, నామినేట్ పదవుల భర్తీకి వెంటనే జాబితాలు సిద్ధంచేసి పంపాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించి అంశాలపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చా జరగలేదని సమాచారం. వర్ల రామయ్య జన్మదినం కావటంతో వేదికపైనే సీఎం చంద్రబాబు కేక్ కట్ చేయించి నేతలతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.