
ఆస్తి కోసమే బాలిక హత్య
లైంగిక దాడి జరిపి ఆపై అఘాయిత్యం
ఇద్దరు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన రూరల్ జిల్లా ఎస్పీ
నరసరావుపేట టౌన్ : వినుకొండ పట్టణం రాజీవ్ రజకకాలనీకి చెందిన పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి దారుణంగా హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. హతురాలు లక్ష్మీతిరుపతమ్మ ఆస్తికి ఏకైక వారసురాలు కావడంతో ఈ దారుణానికి నిందితులు ఒడిగట్టారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ గురువారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న వినుకొండ పట్టణం రాజీవ్ రజక కాలనీకి చెందిన పాలడుగు నారాయణ, లింగేశ్వరి దంపతుల పెంపుడు కుమార్తె లక్ష్మీతిరుపతమ్మ(10) కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుమేరకు అదృశ్యం కేసు నమోదు చేసి వినుకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 14వ తేదీ శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామ సమీపంలో న క్కలదిండెవాగు వద్ద గుర్తు తెలియని బాలిక మృతి చెంది ఉందని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. శావల్యాపురం పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణ, లింగేశ్వరి దంపతులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలు తమ కుమార్తె లక్ష్మీతిరుపతమ్మగా గుర్తించారు.
సంఘటన జరిగిన తీరును బట్టి పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. తదుపరి విచారణలో మృతురాలి తల్లికి దగ్గర బంధువైన కొత్తపల్లి వెంకటేశ్వర్లు బాలిక లక్ష్మీతిరుపతమ్మను ఇంటి వద్దనుంచి మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు ప్రాథమికంగా తేలింది. వెంకటేశ్వర్లుది నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామం కాగా.. ప్రస్తుతం యడ్లపాడు మండలం సొలసలో ఉంటున్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టగా అనుమానితుడు వెంకటేశ్వర్లు నేరం జరిగిన రోజు నుంచి ఇంటి వద్ద లేడని నిర్ధారణ అయింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద ఉన్నారన్న సమాచారం మేరకు వెంకటేశ్వర్లు, అతని బంధువు యల్లమందను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. లక్ష్మీతిరుపతమ్మ తన పెంపుడు తండ్రి నారాయణ, ఆయన తల్లి సీతమ్మ, పిన్ని కాశమ్మలకు ఏకైక వారసురాలు. వీరందరి ఆస్తి లక్ష్మీతిరుపతమ్మకు చెందుతాయి. ఆమే లేకుంటే సమీప బంధువులైన తమకు దక్కే అవకాశం ఉందన్న దురాశతోనే హత్య చేసేందుకు బంధువులైన కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అతని అన్న వియ్యంకుడు త్రిపురాంతకం మండలం రాజుపాలేనికి చెందిన నరసాయపాలెం యల్లమంద పథకం రచించారు.
ఈ నెల 12న వినుకొండ పట్టణం రాజీవ్ రజకకాలనీకి వెంకటేశ్వర్లు వెళ్లి బాలిక లక్ష్మీతిరుపతమ్మకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై శావల్యాపురం మండలం నక్కలదిండెవాగు వద్దకు తీసుకెళ్లారు. వెంకటేశ్వర్లు బాలికపై లైంగికదాడి జరిపి అనంతరం యల్లమంద సహాయంతో హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారని ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, వినుకొండ సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, శావల్యాపురం ఎస్‌ఐ రవికృష్ణ పాల్గొన్నారు.