ప్రత్యేక హోదా'పై దాగుడుమూతలు | proposal to close on special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా'పై దాగుడుమూతలు

Published Tue, Mar 10 2015 3:58 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

proposal to close on special status

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహార శైలి చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చే అవకాశముందా? ప్రత్యేక హోదాకు సంబంధించిన విధివిధానాలు ఏమిటి? ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత? లేదంటే రెండు ప్రభుత్వాలు కలిసి దోబూచులాడుతున్నాయా? అన్న అనేక ప్రశ్నలు ప్రజలను అయోమయంలోకి నెడుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఒకటికాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలు దాటిపోతున్నా ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై కనీసం ఒక స్పష్టత రాకపోవడం, మొత్తంగా ఈ వ్యవహారం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ వ్యూహంగా అనుమానాలు కలుగుతున్నాయి. 1969 నుంచి ప్రత్యేక హోదా కలిగిన అస్సాం సైతం ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొనసాగించాలని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడాన్ని గమనించినా అనేక సందేహాలకు తావిస్తోంది.

నాడు ఘనంగా ప్రకటనలు...
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో అవశేషాంధ్రప్రదేశ్ ఆదాయ వనరులు కోల్పోతున్నందున వాటిని భర్తీచేసేందుకు, రెవెన్యూ లోటును పూడ్చేందుకు ప్రత్యేక హోదాను కల్పించనున్నామని గత యూపీఏ-2 ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటన చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి వీలుగా ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తామని లోక్‌సభలో ప్రకటించింది. ప్రత్యేక హోదా, రాయితీలను ఐదేళ్లుగా అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటనచేస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పదేళ్లపాటు ఉంచాలని డిమాండ్ చేసింది.

అధికారంలోకి వ చ్చాక పక్కనపెట్టిన బీజేపీ
అధికారంలోకి వచ్చాక ఈ అంశాలను బీజేపీ నేతలు పక్కనపెట్టేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ ప్రభుత్వం ఆ విషయాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎందుకు చేర్చలేకపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం సైతం ఆనాటి బీజేపీ నేతల మాటలను గుర్తుచేసి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో సాగించిన ఢిల్లీ పర్యటనలు చూస్తే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న భావన కల్పించేలా సాగింది. ఎనిమిది నెలల్లో ఎనిమిదిసార్లు కేంద్రం వద్దకు వెళ్లినా ఏ రోజూ ప్రత్యేక హో దా విషయంలో గట్టిగా మాట్లాడలేకపోయారని ఆయన పర్యటన పర్యవసనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతూ రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఒకవైపు సీఎం, మంత్రులు మరోవైపు కేంద్ర మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారు.

చట్టపరమైన హామీలకే వర్తింపు: ప్రత్యేక హోదాను ప్రకటించాలంటే ప్రణాళికా సంఘం నిర్ణయం తీసుకోవాలి. ప్రధాని అధ్యక్షతన ఉండే ప్రణాళికా సంఘాన్ని ఎన్డీయే ప్రభుత్వం  రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘమే రద్దయినప్పుడు ప్రత్యేక హోదాపై నిర్ణయం ఎలా అన్నది ప్రశ్న? నీతి ఆయోగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నా దానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారుకాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు న్యాయం చేస్తామని ఇటీవల పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ‘ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య 14 వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపించలేదు. ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల అధికంగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందడానికి ఈశాన్య రాష్ట్రాలకు అవకాశం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించాలని ప్రతిపాదిస్తున్నా. ఏపీ, తెలంగాణకు సంబంధించి నంత వరకు... రాష్ట్ర విభజన సమయంలో చట్ట పరంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

చట్టంలో లేకుంటే అంతేనా?: విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశమే లేదని, కేవలం విభజన బిల్లు ఆమోదం సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ లోక్‌సభ వేదికగా ప్రత్యేక హోదాపై ప్రకటన మాత్రమే చేశారు తప్ప దాన్ని చట్టంలో చేర్చలేదని రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెబుతున్నారు. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు మంత్రులు మాటలు విన్నవారికి అసలు ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందా? లేదా? అన్న సందిగ్థంలో పడక తప్పదు. అరుణ్‌జైట్లీ లోక్‌సభలో చేసిన ప్రసంగం ప్రకారం చూస్తే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా భవిష్యత్‌లో కొనసాగిస్తారా? అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రణాళికా సంఘం, దాని అనుబంధ జాతీయ అభివద్ధి మండలిని ఇప్పటికే రద్దుచేశారు. ఈ తరుణంలో రద్దయిన ప్రణాళికా సంఘం రాష్ట్రాలకు అదనపు ప్రణాళికా గ్రాంట్లు ఇవ్వడానికి వీలుగా రూపొందించిన ‘ప్రత్యేక హోదా’ విధానం కొనసాగుతుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

13వ ఆర్థిక సంఘం వరకు.. ప్రణాళికేతర రెవెన్యూ లోటుకు ఆ సంఘం గ్రాంట్లు ఇచ్చేలా సిఫార్సులు ప్రతిపాదిస్తుండగా, ప్రణాళికా వ్యయానికి ప్రణాళికా సంఘం గ్రాంట్లు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ఏయే రాష్ట్రానికి ఎంతెంత లోటు ఏర్పడుతుందో స్పష్టీకరించింది. అయితే ఆమేరకు ప్రణాళికా వ్యయానికి గ్రాంట్లు ఇవ్వాలని సిఫార్సు చేసేందుకు ప్రణాళికా సంఘం ఇప్పుడు ఉనికిలోనే లేదు. 14వ ఆర్థిక సంఘం నివేదికలోని పేరా 2.29లో పేర్కొన్న సిఫార్సు.. ‘మేం సిఫార్సులు చేయడంలో, విధానాలు తయారు చేయడంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలు అని బేధాన్ని పరిగణలనలోకి తీసుకోలేదు. పన్నుల రాబడి పంపిణీ ద్వారా రాష్ట్రాల వనరుల లోటును వీలయినంతమేర తగ్గించాలనే లక్ష్యంతో పనిచేశాం. పన్నుల పంపిణీ ద్వారా లోటు ను తగ్గించడానికి వీలు కాకపోతే, రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. ‘వాస్తవంగా రాష్ట్రాలకు ఉన్న ఖర్చు-అవసరాలు, రాబడిని అంచనా వేశాం’ అని తర్వాత పేరాలో రాశారు.

మరి హోదా ఉన్న రాష్ట్రాల సంగతేంటి?
ప్రణాళికా సంఘం రద్దయినందున ప్రత్యేక హోదా అంశం కూడా రద్దు జాబితాలో చేరిందన్నట్లుగా కేం ద్రంలోని నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా అన్న దాని ఉనికే ఇపుడు లేనప్పుడు మరి దేశంలో కొన్నేళ్లుగా ప్రత్యేక హోదాలో ఉన్న రాష్ట్రాల్లో అది కొనసాగుతుందా? రద్దవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌తోపాటు మరికొ న్ని ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాను పొందుతున్నాయి. ప్రత్యేక హోదా విధానాన్ని కేంద్రం రద్దు చేసినట్లుగా అనిపించకపోతే, తమ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ మార్చి 4న ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అస్సాంకు 1969 నుంచి ప్రత్యేక హోదా ఉన్న విషయం విదితమే.

కింకర్తవ్యం?: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు, ప్రత్యేకంగా రాయితీలేవీ రాష్ట్రానికి ప్రకటించనప్పుడు, ప్రత్యేక హోదా కల్పించడమన్నది చట్టంలో లేదని చెబుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిత్తుశుద్ధితో అన్ని పక్షాలతో కలసి ఇప్పటికే కేంద్రాన్ని ఒప్పించే పని చేయాలి. కేంద్రంపై ఒత్తిడి చేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్న విషయం అందరూ చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంలోని మిత్రపక్షంపై నోరు మెదపడానికి ఏమాత్రం సిద్ధంగాలేదు. సినీనటులతో లాబీయింగ్ చేయిస్తే సరిపోతుందన్న ధోరణితో వెళితే మాత్రం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా... కనీసం రాయితీలను కూడా సాధించలేమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement