హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు
హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు
Published Sat, Oct 22 2016 9:09 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
- 25న కర్నూలులో యువభేరి
-హాజరుకానున్న వైఎస్ జగన్
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదానే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువభేరి కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు. అలాగే రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, ఆర్‌యూ విభాగం ప్రెసిడెంట్ దేవాల ఆధ్వర్యంలో స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో యువభేరి పోస్టర్ల విడుదల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో పాటు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అధినేత నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25న నిర్వహించే యువభేరిలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సలాంబాబు, రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర నాయకుడు గోపినాథ్‌యాదవ్, రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి రఘు, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, మైనారిటీసెల్ జిల్లా నాయకుడు దొడ్డిపాడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్ని మభ్యపెడుతున్న బాబు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రెండున్నర ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వస్తుందంటూ, రాదంటూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారని, చివరికి ప్యాకేజీయే మంచిదంటూ ప్రజల్ని వంచిచేందుకు యత్నిస్తున్నారని పీఏసీ చైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మొదట్నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా మన హక్కు అని ప్రజల పక్షాన నిలిచిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటేనన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో ఉద్యమిస్తున్నారని తెలిపారు. హోదా రాకపోతే ఎక్కువగా ఇబ్బంది పడేది రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలేనన్నారు. ఇప్పటికే సీమ రైతులు కరువు, కాటకాలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసు భయం..
ఓటుకు నోటు కేసు భయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అప్పట్లో పార్లమెంటులో చెప్పి, ఇప్పుడు ప్యాకేజీయే ముఖ్యమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాటమార్చడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోరాటం సాగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 25న కర్నూలులో జరిగే యువభేరిని జయప్రదం చేయాలని కోరారు.
Advertisement
Advertisement