రాజధాని ప్రాంతం మందడంలో మంగళవారం జరిగిన రైతు సమావేశం రసాభాసగా మారింది. రాజధాని నిర్మాణానికి
♦ ఎమ్మెల్యేను నిలదీసిన రాజధాని ప్రాంత రైతులు
♦ సమావేశం రసాభాస వెంటనే పింఛన్ ఇవ్వాలని
♦ ఆందోళనకు దిగిన రైతులు
తుళ్ళూరు : రాజధాని ప్రాంతం మందడంలో మంగళవారం జరిగిన రైతు సమావేశం రసాభాసగా మారింది. రాజధాని నిర్మాణానికి భూములిస్తే నేటికీ పైసా ఇవ్వలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో వాగ్వివాదానికి దిగారు. వ్యవసాయ కూలీలకు సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు. మందడం, వెంకటపాలెం రెవెన్యూ పరిధిలోని 660.30 ఎకరాలను ప్రభుత్వం అటవీ భూములుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. వీటితో పాటు మంగళగిరి మండలంలోని కురగల్లు, నీరుకొండకు చెందిన మరో 550 ఎకరాలు వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈనెల 18న వెంకటపాలెం, మందడం, ఐనవోలు, కురగల్లు, నీరుకొండకు చెందిన 150 మంది రైతులు మందడంలోని శ్రీవేణుగోపాలస్వామి గుడిలో సమావేశమయ్యారు. తిరిగి మంగళవారం మరోసారి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పట్టా భూముల్ని ల్యాండ్‌పూలింగ్‌లో ఇచ్చామని, తీరా ఇప్పుడు అటవీ,అసైన్డ్ భూములని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. నెలనెలా ఇస్తామన్న రూ. 2500లు పింఛను అతీగతీ లేదని వ్యవసాయ కూలీలు ఆందోళనకు దిగారు.
సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ వై.రాధాకృష్ణ మాట్లాడుడూ భూములిచ్చిన రైతులు ఎలా బతకాలంటూ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ను నిలదీశారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం పరిస్థితిలో ఆయన మౌనంగా కూర్చుండిపోయారు. కొద్ది నిమిషాల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద రైతులు, వ్యవసాయకూలీలకు ప్రభుత్వపరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పిస్తామని, అలా చేయలేని పక్షంలో పదవి తనకు అవసరం లేదన్నారు. అసైన్డ్ భూమి సాగుదారులకి అన్యాయం జరగదని, వాటిని అమ్ముకోవద్దని సూచించారు.
ల్యాండ్ పూలింగ్‌లో లంక భూముల్ని తీసుకోలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జూలై 1 నుంచి రూ.2500లు పింఛన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు ప్రసంగిస్తూ రాజధాని శంకుస్థాపనకు గడువు ఉన్నందున అప్పటి వరకు పంటలు సాగు చేసుకొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, తహశీల్దార్ అన్నే సుధీర్‌బాబు, ఎండీవో జె.మోహన్‌రావు పాల్గొన్నారు.