సాలూరు: రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఒకటైన ప్రోటోకాల్‌ను గౌరవించరా..? మాజీ ఎమ్మెల్యే అయిన మీకు ప్రోటోకాల్ వర్తించదన్న విషయం తెలియ దా..?, అంటూ సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర, అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భ ంజ్‌దేవ్‌ను నిలదీశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా కనిపించిన ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారంపై భంజ్‌దేవ్, రాజన్నదొర మంగళవారం ఒకే వేదికపైకి రావడంతో బాహాటంగానే వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే రాజన్నదొరను వేదిక మీదకు ఆహ్వనించిన జేడిఏ ప్రమీల ఆతర్వాత మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ఆహ్వనించడంతో రాజన్నదొర అభ్యంతరం తెలిపారు.
పోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి పిలవకండని జేడీకి సూచించారు. దీంతో కలుగజేసుకున్న భంజ్‌దేవ్ ప్రోటోకాల్ మెయింటెయిన్ చేయాల్సింది అధికారులని, ఈవిషయంపై వారినే ప్రశ్నించండని బదులిస్తూనే వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ ప్రోటోకాల్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని పాటించకపోతే రాజ్యాంగం, శాసనసభ, చట్టం కల్పించిన హక్కులు దండగేనన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌కు, స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలోని గోముఖి రెగ్యులేటర్ పనులతోపాటు, పాచిపెంటమండలంలోని రోడ్డు మరమ్మతుల పనులకు శంకుస్థాపనలు చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘన కాదంటారా? అని ప్రశ్నించారు. అనంతరం భంజ్‌దేవ్ మాట్లాడుతూ తాము శంకుస్థాపనలు చేసిన పనులకు అనుమతులు రాలేదన్నారు.
కానీ గోముఖి రెగ్యులేటర్ ఆయకట్టు రైతులకు నష్టం జరగకూడదని, పాచిపెంట మండలంలో రాకపోకలకు అంతరాయం కలగకూడదని భావించి సంబంధిత కాంట్రాక్టర్లను ఒప్పించి, నిధులు తర్వాత మంజూరవుతాయని చెప్పి పనులను ప్రారంభించేలా చేశామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి మరో నెలా15రోజులు పడుతుందని, తర్వాత ప్రోటోకాల్ అమలు చేస్తారని సమాధానమిచ్చారు. దీంతో కలుగజేసుకున్న రాజన్నదొర బహిరంగంగా పనులు ప్రారంభించేటపుడు ప్రోటోకాల్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒక్క ఎమ్మెల్యే చేసేదేమీ ఉండదని, అందరం కలిసికట్టుగా పనిచేసి, ప్రజలకు మేలు చేద్దామని కోరుతున్నానన్నారు. వీరి వాగ్వాదం తారస్థాయికి చేరడంతో అధికారులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు.
వ్యవసాయ ఉపకరణాల పంపిణీ
స్థానిక ఏడీఏ కార్యాలయంవద్ద సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాలకు చెందిన 14 రైతు సంఘాలకు దాదాపు కోటి రూపాయల విలువచేసే టైరు బండ్లు, ట్రాక్టర్లను ఎమ్మెల్యే రాజన్నదొర మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో పట్టాలు పొందిన రైతులకు న్యాయం జరగడంలేదన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించే పరిస్థితి లేదన్నారు. అనంతరం జేడీఏ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పింది నిజమేనని అంగీకరించారు. వేర్వేరు సర్వే నంబర్ల భూముల్లో పంట నష్టం జరిగినా, ఒకే సర్వే నంబరును మాత్రమే సాఫ్ట్‌వేర్ గుర్తించిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంద్యారాణి, ఎంపీపీ బోను ఈశ్వరమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డి సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి రంగ, లయన్స్‌క్లబ్ చైర్మన్ అభ్యర్థి గొర్లె మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌ను మంటగలుపుతారా..?
Published Wed, Nov 5 2014 3:19 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement