కడప అర్బన్, న్యూస్‌లైన్: రోగులకు మంచి వైద్యసేవలందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. రిమ్స్ లో ఏవైనా లోటుపాట్లుంటే సవరించి మెరుగైన వసతులు కల్పిస్తామని, అందు కు తగ్గట్లు వైద్య సేవలందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. రిమ్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో హెచ్‌డీఎస్ చైర్మన్ హోదా లో ఆయన మాట్లాడారు. వైద్యసేవల కోసం వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. హౌస్ సర్జన్లు, ఇతర డాక్టర్లు తప్పనిసరిగా ఎప్రాన్‌లు ధరించాలని, వాటితోపాటు నేమ్‌ప్లేట్లు కూడా ఉండాలని ఆదేశించారు.
‘ఆరోగ్యశ్రీ’ ఆపరేషన్లు చేయాలి..
ఆరోగ్యశ్రీ కింద రిమ్స్‌లో ఎందుకు రోగులకు వైద్యసేవలు అందించలేకపోతున్నారని కలెక్టర్ వైద్యులను ప్రశ్నించారు. రిమ్స్‌లో కంటే బయటి ఆస్పత్రుల్లో ఎక్కువగా చేస్తున్నారన్నారు. పెద్ద ఆస్పత్రి నిపుణులైన వైద్య బృందం ఉన్నా తక్కువ సంఖ్యలో రోగులు ఉన్నారన్నారు. ఇక నుంచి రిమ్స్‌లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పెరగాలని తెలిపారు. ల్యాబోరేటరీలు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా విభాగాలకు కేటాయించిన వైద్య పరికరాలను ఉపయోగించడం లేదని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ కలెక్టర్ దృష్టికి తీ సుకొచ్చారు.
పరికరాలు ఉపయోగించే లా సిబ్బందికి బాధ్యతలు నిర్దారిస్తూ వెం టనే ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన పరికరాల కొనుగోలు,పెద్ద మొత్తంలో మరమ్మతుల కోసం నిధులను కోరుతూ వివరణాత్మకమైన నివేదికతో సరైన రూపంలో ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
పూర్తి వివరాలు ఇవ్వాలి..
స్కానింగ్ చేసిన తర్వాత నివేదికలో బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలిసేలా వివరాలు ఇవ్వాలన్నారు. స్కానింగ్ వివరాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల రెండోసారి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
త్వరలో ప్రొఫెసర్ల భర్తీకి
ప్రభుత్వం చర్యలు..
రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ చెప్పారు. ఈ అంశంపై అక్కడే వైద్య, ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడారు.
నెలాఖరులోపు నీటి సమస్య పరిష్కారం..
రిమ్స్‌లో నీటి సమస్య పరిష్కారంపై కలెక్టర్ ఏపీహెచ్‌ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్లేశ్వరరెడ్డిని వివరణ కోరారు. ఈనెలాఖరులోపు ప్రస్తుతం ఉన్న పైపులైన్లను తొలగించి కొత్త పైపులు వేస్తామని ఈఈ తెలిపారు. బ్లడ్ బ్యాంక్‌లో ఏసీలు పనిచేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయించాలని ఈఈని ఆదేశించారు.
రెండు నెలల అనంతరం మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పటిలోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌శరణ్, ప్రిన్సిపల్ డాక్టర్ బాలకృష్ణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, డీఎంహెచ్‌ఓ ప్రభుదాస్, డాక్టర్ బాలిరెడ్డి, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
మంచి వైద్యం అందించండి
Published Fri, Jan 17 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement