వర్షాకాలం ప్రారంభమైంది. జ్వరాలు ప్రబలుతున్నాయి. రోగులతో ఆస్పత్రులు
కిటకిటలాడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు
చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. వ్యాధులు మరింత తీవ్ర రూపం దాల్చకముందే పకడ్బందీగా నివారణ చర్యలు చేపట్టడం అవసరం.
సాక్షి, కడప : వర్షాకాలం ప్రారంభమైందో లేదో అప్పుడే జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో జ్వర పీడితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జలుబు, జ్వరాలతో జనం ఎక్కువ బాధపడుతున్నారు. నియోజకవర్గాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా, మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 20 మంది డాక్టర్లు పీజీ కోర్సుకు వెళ్లనున్న నేపథ్యంలో దాదాపు 25 స్థానాల్లో డాక్టర్ల కొరత ఏర్పడనుంది.
రాయచోటి ఆస్పత్రికి రోజూ 150 మందికి పైగా జ్వర పీడితులు
రాయచోటి ఏరియా ఆస్పత్రికి ప్రతిరోజు 500 నుంచి 600 మంది రోగులు వస్తుండగా, అందులో 150 నుంచి 200 మంది జ్వర పీడితులే ఉంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క రాయచోటిలోనే కాకుండా పులివెందులలోని ఏరియా ఆస్పత్రికి కూడా ప్రతిరోజు 30 నుంచి 40 మంది జ్వరాలతో వస్తున్నారు. అలాగే మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కడప తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.
రెండు నెలల్లో రెండు డెంగీ కేసులు
జిల్లాలో జూన్, జులై నెలల్లో రెండు డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. పెండ్లిమర్రి మండలంలోని చౌటపల్లెలో ఒకటి, జిల్లా కేంద్రమైన కడపలో ఒక కేసు ఇటీవలే నమోదయ్యాయి. అధికారికంగా రెండే అయినా డెంగీ సోకిన వెంటనే ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు పొంది అనంతరం కర్నూలు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళుతున్న కేసులు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాను వేధిస్తున్న వైద్యుల కొరత
జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరియా ఆస్పత్రులతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు పీహెచ్‌సీలలో వైద్యుల కొరత వేధిస్తోంది. మైదుకూరు 30 పడకల ఆస్పత్రిలో కేవలం ఇద్దరు వైద్యులు ఉండగా, అందులో ఒక వైద్యుడు శిక్షణ నిమిత్తం వెళ్లడంతో మరొకరు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. కమలాపురంలో కూడా ఎనిమిది మంది వైద్యులకుగాను కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో 18 మందికిగాను కేవలం 10 మందే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 20 మంది వైద్యులు పీజీ కోర్సు చేసేందుకు వెళ్లారు. మరో ఐదు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో మొత్తం 25 మంది వైద్యులు అందుబాటులో లేరు.
నియోజకవర్గ కేంద్రాల్లో డెంగీ కిట్లు అవసరం
డెంగీ లక్షణాలతో ఎవరికైనా జ్వరం ఉన్నట్లయితే కడపలోని రిమ్స్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో డెంగీ కిట్స్ అందుబాటులో ఉంటే అక్కడే పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకునేందుకు కొంత అవకాశముంటుంది.
అందరినీ అప్రమత్తం చేశాం
జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పంచాయతీ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది, ఎంపీడీఓలను అప్రమత్తం చేశాం. నీటి ట్యాంకులు శుభ్రం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా వరకు వ్యాధులను అరికట్టవచ్చు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే దోమకాటుకు గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలి. 24 గంటలు పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ ప్రభుదాస్, డీఎంహెచ్‌ఓ, కడప.
అన్నిచోట్ల డీటీటీ స్ప్రే చేస్తున్నాం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మలేరియా, ఫైరత్రం, అబార్ట్, మలాథియన్ మందులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని అన్ని క్లస్టర్స్ యూనిట్ ఆఫీసర్ల దగ్గర ఉంచాం. అన్ని ప్రాంతాల్లో కూడా డీటీటీ స్ప్రే చేస్తున్నాం. అన్ని హాస్టల్స్‌లో ఫైరత్రం పంపిణీ చేస్తున్నాం. డెంగీ అనుమానం ఉన్న వారి బ్లడ్ సిరాను తీసి రిమ్స్‌కు పంపుతున్నాం.
- త్యాగరాజు, జిల్లా మలేరియా అధికారి,
కడప.
ప్రబలుతున్న జ్వరం
Published Fri, Aug 1 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement
Advertisement