సాక్షి, కడప: జిల్లాలో పాముకాటుకు గురై మరణించిన వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. రోజూ ఒకరు రిమ్స్‌కు వస్తున్నారంటే, పాముకాటు బాధితుల సంఖ్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం కావడం, వ్యవసాయ పనుల్లో రైతులు పొలాల వద్దకు వెళుతుండటంతో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.
మందు స్టోర్‌లో ఉంది...పీహెచ్‌సీలలో లేదు:
జిల్లాలో రిమ్స్ కాకుండా 72 పీహెచ్‌సీ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా 448 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటిలో 24 గంటలూ పని చేసే పీహెచ్‌సీలు జిల్లాలో 34 ఉన్నాయి. వీటిలో ఎర్రగుంట్ల మునిసిపాలిటీ మాత్రం లేదు. అలాగే వైద్యవిధాన పరిషత్ పరిధిలో 6 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఏరియా ఆస్పత్రులలో ఏఎస్‌వీ(యాంటీ స్నేక్ వీనమ్) వైల్స్ స్టాకు ఉన్నాయి. పల్లె ప్రాంతాల్లో పాముకాటుకు గురైనవారు వీలైనంత వరకూ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, రాజంపేట, పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. రిమ్స్‌లో కూడా మందుల కొరత లేదు.
జిల్లాలోని పీహెచ్‌సీలలో ఏఎస్‌వీ వైల్స్ కొరత తీవ్రంగా ఉంది. జిల్లా డ్రగ్‌స్టోర్‌లో మాత్రం 4,220 వైల్స్ స్టాకు ఉంది. త్వరలో మరో 5వేల వైల్స్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టాకును తీసుకుపోవల్సిన బాధ్యత పీహెచ్‌సీలలోని వైద్యులదే! ఈ నెల డ్రగ్ స్టోర్ నుండి 17 పీహెచ్‌సీల వారు స్టాకును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తక్కిన పీహెచ్‌సీలు ‘పాము మందు’ను పట్టించుకోలేదు.
ఇటీవల పాము కాటుకు గురైన మరికొందరు.:
ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులో మిట్ట గంగులయ్య(41) అనే ఉపాధి కూలీ పాముకాాటుకు బలయ్యాడు. ఆయన భార్య విక్టోరియా, కుమారుడితో పాటు మూడునెలల చిన్నారికి పెద్దదిక్కు లేకుండా పోయింది.
కమలాపురం మండలం కుప్పువారిపల్లెలో సింధూజ(8) అనే చిన్నారి తేలుకాటుకు బలైంది.
రాజుపాళెం మండలం వెల్లాలలో రామయ్యఅనే రైతుకు చెందిన 40 వేల రూపాయల విలువచేసే ఎద్దు పాముకాటుతో చనిపోయింది.
స్టాకు ఉన్నాయి..: ప్రభుదాస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ.
మా వద్ద యాంటీవీనమ్ సీరమ్ స్టాకు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో ఉంది. వీటిని పీహెచ్‌సీలు తీసుకెళ్లాలి. ఎవరు తీసుకెళ్లారు?లేదు? అనే వివరాలు మావద్దకు రావడం లేదు. ఎవరికి అవసరం ఉంటే వారు తీసుకెళ్లాలి.
ఆలస్యం లేకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి: డాక్టర్ సురేశ్వరరెడ్డి, అసోసియేట్ ఫ్రొఫెసర్, రిమ్స్.
వ్యవసాయసీజన్ కావడంతో పాముకాటు కేసులు అధికంగా ఉంటాయి. నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, పిట్‌వైపర్ పాములు విషపూరితాలు. పాము కరిచిన వెంటనే సబ్బునీళ్లతో గాయాన్ని శుభ్రం చేయాలి. కరిచిన చోట ఎలాంటి గాయాలు చేయకూడదు. నోటితో కొరకకూడదు. కాటుపైన తాడు, లేదా బట్టతో గట్టిగా కట్టాలి. ఎలాంటి ఆలస్యం లేకుండా దగ్గర్లోని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. బాధితుడు ధైర్యంగా ఉండాలి. మంత్రాలు, చెట్టువైద్యం, నర్సులు, ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకూడదు. 108 సిబ్బంది సాయం తీసుకోవచ్చు. పాము కరిచిన చోట వాపు వచ్చినా, మల, మూత్రం, నోటి ద్వారా రక్తం వచ్చినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా, కళ్లు మూసుకుపోతున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని పాముకాటుకు మందులు ఉన్నాయి.
కాటికే..
Published Fri, Sep 20 2013 2:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement