తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి, ఆపై కత్తితో దారుణంగా హతమార్చిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ పరిధి కాన్కూర్‌కు చెందిన కొండపెల్లి అనూష(14) హత్య కేసులో నిందితులు బోగె రవి, అతడికి సహకరించిన వైశాక నరేశ్‌ను అరెస్ట్ చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వెంకటేశ్వరబాబు తెలిపారు. జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు.
కాన్కూర్‌కు చెందిన కొండపెల్లి అనూష ముదిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు తల్లి తార, సోదరుడు రాజశేఖర్ ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బోగె రవి ఇంటర్ మధ్యలో మానేసి మూడేళ్లుగా జులాయిగా తిరుగుతున్నాడు. గత వేసవిలో తునికాకు కొమ్మ కొట్టే పనులకు వెళ్లిన రవికి అనూషతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ముదిగుంటలోని పాఠశాలకు వెళ్లే సమయంలో రహదారిలో అనూషకు తారసపడుతూ తనను ప్రేమించాలని వేధించేవాడు. కొన్ని నెలల తర్వాత విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది.
స్పందించిన కుటుంబ సభ్యులు, బాలిక మేనమామ శంకర్ కలిసి రవిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. 15 రోజుల తర్వాత అనూష ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో రవి ఘర్షణపడ్డాడు. మైనర్ అయిన తన బిడ్డకు ఇప్పట్లో పెళ్లి చేయబోమని అనూష తల్లి తార, సోదరుడు స్పష్టంచేశారు. దీంతో వారిపై రవి కక్ష గట్టాడు. ఫిబ్రవరి 25న అనూష తల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడాన్ని గమనించాడు. ఆ సమయంలో ఆరుబయట అనూష తన స్నేహితురాలితో చదువుకుంటుండగా ఇంట్లో ఆమె అన్న రాజశేఖర్ ఉన్నాడు.
ఇదే అదనుగా భావించిన రవి తన స్నేహితుడు నరేందర్‌తో కలిసి పథకం రచించాడు. కూల్‌డ్రింక్ తాగుదాం రమ్మంటూ రాజశేఖర్‌ను కిరాణ షాప్‌కు తీసుకెళ్లాలని నరేందర్‌కు చెప్పాడు. ఈ మేరకు అతడు రాజశేఖర్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లగానే రవి కత్తితో అనూష ఇంటికి వెళ్లాడు. అనూషను ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపు మడుగులో పడి ఉండడంతో చనిపోయిందనుకుని ఇంటికి గడియపెట్టి పారిపోయాడు. బయట ఉన్న అనూష స్నేహితురాలు కేకలు వేస్తూ విషయం స్థానికులకు చెప్పింది.
కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న అనూషను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అదే రోజు రాత్రి చనిపోయింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం మండలంలోని రసూల్‌పల్లి వద్ద రవిని, అతడి స్నేహితుడు నరేందర్‌ను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి బైక్, హత్యకు వినియోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు. వేధిస్తున్న విషయం ముందే పోలీసులకు తెలిపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదికాదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై శ్రీలత, శ్రీరాంపూర్ మహిళా పోలీస్టేషన్ ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థిని హత్య చేసిన ప్రేమోన్మాది అరెస్ట్
Published Fri, Mar 7 2014 8:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement