ఆదిలాబాద్ టౌన్ : మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ గజరావు భూ పాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో శనివారం లొంగిపోయిన మావోయిస్టు మంగి దళ సభ్యుడు సిడాం లక్ష్మణ్ అలియాస్ సురేందర్‌కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
ఖానాపూర్ మండలంలోని కొలాంగూడ (సోమవార్‌పేట్)కు చెందిన సిడాం లక్ష్మణ్ అలియాస్ సురేందర్ కట్టెలు, చేపలు అమ్ముతూ జీవించేవాడు. ఆ సమయంలో కడెం మండలం గంగాపూర్ గ్రామస్తుడు కంది రవి (మంగిదళ సభ్యురాలు కంది లింగవ్వ భర్త) కొలాంగూడకు చెక్కల కోసం వస్తుండడంతో పరిచయం ఏర్పడింది. నెలకు రూ.20 వేల జీతం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఈ ఏడాది జూలై 1న గుడుంబా తాగించి తన మోటార్‌సైకిల్‌పై మంగి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.
అతనికి తెలియకుండానే దళంలో చేరిన లక్ష్మణ్.. తాను మోసపోయానని గ్రహించి కలిసిన వారికి తన గోడు వెలిబుచ్చాడు. అయినా ఎలాంటి ప్రయోజనమూ లేకుండాపోయింది. దళం ప్రతినిధులైన శోభన్ అలియాస్ చార్లెస్, జ్యోతి అక్కతో ఉండిపోయాడు. జూలై 3న ఉదయం పది మంది దళ ప్రతినిధులతో కలిసి పరేడ్ చేసిన అనంతరం గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి 17 రోజుల తర్వాత బండి ప్రకాష్ లక్ష్మణ్‌కు బ్యాగ్, ప్లాస్టిక్ కవర్, వాటర్‌క్యాన్, గొడుగు, నాటు తుపాకీ అందజేశారు.
జూలై 31న కాసిపేట మండలంలోని దేవాపూర్ దగ్గరలోని కుర్రెఘాట్ అడవిలో దళంతో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దళ సభ్యులు మొదటిసారి కాల్పులు జరపగా, పోలీసులు సైతం కాల్పులు ప్రారంభించారు. దీంతో వారు పారిపోయారు. రెండోసారి సెప్టెంబర్ 14న తిర్యాణి మండలంలోని పంగిడి మాదారం అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా, లొంగిపోవాలని చెప్పగా లక్ష్మణ భయపడి తుపాకీ, డ్రెస్‌ను పడేసి రాత్రంతా చెట్టుపై కూర్చున్నాడు.
దళం నిర్దేషించిన ప్రదేశానికి వెళ్లకుండా వట్టివాగు గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి లారీలో ఇంటికి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన సంఘటనను వివరించాడు. శనివారం లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు.
మాయమాటలు చెప్పి అమాయక గిరిజన యువకులు మావోయిస్టులు దళంలోకి చేర్పిస్తున్నారని, వారి మాటలు నమ్మి యువకులు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. మావోయిస్టులెవరైనా లొంగిపోవాలని నిర్ణయించిన వెంటనే 9440795000 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. లక్ష్మణ్‌కు ప్రభుత్వం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ (పరిపాలన) పనసారెడ్డి పాల్గొన్నారు.
వనం వీడండి..
Published Sun, Oct 26 2014 4:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement