
బిర్లా మ్యూజియంలో భద్రపర్చిన వేమనపల్లి డైనోసార్
కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఎన్నో జీవజాతులు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకునే రాకాసి బల్లులు ఒకప్పుడు మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ప్రాణహిత తీరం వెంబడి రారాజులుగా వెలుగొందాయి. వేమనపల్లిలో గుర్తించిన డైనోసార్ శిలాజాన్నే ప్రస్తుతం హైదరాబాద్‌లోని మ్యూజియంలో భద్రపర్చారు. దీంతోపాటు నత్తగుళ్లలు, చేప, వృక్ష, తాబేలు శిలాజాలను శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్నారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కొందరు చరిత్రకారులు తీరం వెంబడి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత వీటి ఉనికిని పట్టించుకోకపోవడంతో అధికవర్షాలు, కబ్జాల కారణంగా మట్టిలో కలిసిపోతున్నాయి.
సాక్షి, వేమనపల్లి(బెల్లంపల్లి)ఆదిలాబాద్: వేమనపల్లి మండలంలోని రాజారం, మంగెనపల్లి, దస్నాపూర్, సుంపుటం, ప్రాణ హిత ప్రాంతాల్లో 16 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఎన్నో రకాల శిలాజాలు ఇప్పటికీ విసిరేసిన ట్లు పడి ఉన్నాయి. 1925లో మలాన్ అనే జర్మ న్ శాస్త్రవేత్త కోటసారస్‌గా పిలిచే డైనోసార్ (రాకాసి బల్లి), ఫైసా అనే నత్తగుళ్ల, చేప, వృక్ష, తాబేలు ఆకృతుల్లో ఉన్న శిలాజాలను గు ర్తించారు. ఆ ఆనవాళ్ల ఆధారంగా 1970–85 మధ్య జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో యాదగిరి అనే శాస్త్రవే త్త స్థానిక కూలీల సాయంతో తవ్వకాలు జరి పారు. అప్పట్లో గుర్తించిన డైనోసార్ శిలాజా న్ని హైదరాబాద్‌లోని బిర్లా మ్యూజియానికి తరలించారు. వీటితోపాటు మండలాన్ని ఆనుకుని ఉన్న మత్తడి ఒర్రె, ప్రాణహిత తీరం వెంట విభిన్న ఆకృతుల శిలాజాలు ఉన్నాయి.
అటవీశాఖ ఆధ్వర్యంలో సేకరించిన వృక్ష శిలాజాలు
అటవీశాఖ సంరక్షణ
వేమనపల్లి, రాజారాం పరిసరాల్లో దొరికిన శి లాజాల రక్షణకు అట వీ శాఖ ప్రత్యేక చర్యలు తీ సుకుంది. మూడు సంవత్సరాల క్రితం డీఎఫ్‌ఓ గా పనిచేసిన ప్రభాకర్‌రావు వృక్ష, తాబేలు శి లాజాలను బొక్కలగుట్ట గాంధారి వనం, హైదరాబాద్ మ్యూజియానికి తరలించారు. సతీశ్‌బక్షి అనే జియాలజిస్ట్ ఈ ప్రాంతంలో దొరికే శిలాజాలపై పరిశోధనలు చేశారు. నత్తగుల్ల, వృక్ష, దారు, చేప శిలాజ అవశేషాలను పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లారు. ఇటీవల ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ బృందం కూడా శిలాజ ఆనవాళ్లు, ఇతర అంశాలపై వేమనపల్లిలో పరిశోధనలు నిర్వహించారు.
ప్రాణహిత తీరంలో నత్తగుళ్లు, తాబేళ్ల శిలాజాలు
ఫాసిల్ పార్క్‌లతో రక్షణ..
మన దేశంలో హిమాచల్ ప్రదేశల్‌లోని శివాలిక్ ఫాసిల్ పార్కు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సల్కాన్ ఫాసిల్ పార్కు, గుజరాత్‌లోని ఇంద్రోడా ఫాసిల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని మాండ్లే ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్కు, తమిళనాడులోని సతనూర్ నేషనల్ ఫాసిల్ పార్కులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే జియాలజికల్ పార్కులు ఉన్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలో సైతం శిలాజ ఆనవాళ్లు గుర్తించి, వర్తమాన్ ఫాసిల్ పార్కు ఏర్పాటుచేశారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ప్రాణాహిత, గోదావరి బేసిన్‌లో ఉన్న వడోధామ్‌లో సారోపోడ్స్ సరీసృపాలు, వృక్షజాతుల శిలాజ జాడలు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడ్‌ధామ్ ఫాసిల్ పార్కుగా మార్చింది. ఇది కొండపల్లి గ్రామానికి సరిహద్దుగా ఉండడంతో స్థానిక వృక్షశిలాజాలు కూడా వాటి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. అరుదుగా ఉండే ఫాసిల్ వుడ్స్ కొండపల్లి ప్రాంతాన్ని, రాకాసి బల్లులు, ఇతర పురాతన జంతుజాలం తిరిగిన వేమనపల్లిని ఫాసిల్ పార్కుగా తీర్చిదిద్దాలని పరిశోధకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కొండపల్లి అటవీప్రాంతంలో వృక్షశిలాజం, వృక్షశిలాజాలను పరిశీలిస్తున్న కలెక్టర్ చంపాలాల్(ఫైల్)
కోట్ల ఏళ్ల నాటి జీవజాతులు
పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోనిఫర్ జాతికి చెందిన వృక్ష శిలాజాలను 2014లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఆరున్నర కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించారు. వర్షాలకు చిన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు పది అడుగుల లోతులో ఉన్న వీటి ఉనికి బయటపడింది. ఇందులో కొన్ని 10 నుంచి 25 అడుగుల పొడవు ఉంటే మరికొన్ని 50 అడుగుల వరకు పొడవు ఉన్నాయి.
సంరక్షణ అందరి బాధ్యత
శిలాజ సంపద సంరక్షణ విషయంలో అందరూ భాగస్వాములు కావాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో గతంలో వృక్ష, ఇతర శిలాజాలను వెలికితీయించాం. వాటిని మంచిర్యాల గాంధారి వనంలో సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచాం. వీటి సంరక్షణకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
– బాబుపటేకర్, డీఆర్‌ఓ, వేమనపల్లి సంరక్షణ అందరి బాధ్యత
40 ఏళ్ల కింద మంగెనపల్లి జంగట్ల రాక్షసి బల్లి బొక్కలు ఉన్నాయంటే త వ్వకాల కోసం కూలీ పనులకు వెళ్లాం. పెద్దసార్లు వచ్చి రాజారాం, మంగెనపల్లికి చెందిన కూలీలను తీసుకెల్లారు. తవ్వకాల్లో దొరికిన వాటిని హైదరాబాద్‌కు తీసుకెళ్లిండ్లు. అప్పట్లో జీపుల్లో వచ్చి తవ్వకాలు జరిపించేవాళ్లు. సర్కారు పట్టింపు చేసి వాటిని బయటకు తీయాలే.
– పాలే శంకర్, వేమనపల్లి
Comments
Please login to add a commentAdd a comment