ప్రజలకు అండగా నిలుస్తాం
పాల కొల్లు : ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తామని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిస్తానని చెప్పారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం నిర్వహించిన పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రస్తుతం నిర్వహిస్తున్న నియోజకవర్గ సమావేశాల అనంతరం మండలస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రయత్నిస్తామన్నారు. కార్యకర్తలు కోరితే గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు నాని స్పష్టం చేశారు.
అధికారమే పరమావధిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన మోసాలు, పాపాలను ప్రజలు అప్పుడే గుర్తించారని చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వే ధించడానికి కేటాయించే సమయాన్ని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వెచ్చిస్తే మంచిందన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడు అండగా ఉంటారని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీయాలని నాని పిలుపునిచ్చారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండడానికి కృషిచేయాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి టీడీపీ అకృత్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, ముదునూరి ప్రసాదరాజు, వంక రవీంద్రనాథ్, గుణ్ణం నాగబాబు, గూడూరి ఉమాబాల, నడపన సత్యనారాయణ, చెల్లెం ఆనందప్రకాష్, యడ్ల తాతాజీ, నడింపల్లి అన్నపూర్ణ, మద్దా చంద్రకళ, పోడూరు మండలాధ్యక్షురాలు గుంటూరి వాణి, గుబ్బల వేణు, బోణం బులివెంకన్న, కంది రామచంద్రరావు, జక్కంశెట్టి బోసు, కర్ణి జోగయ్య, ప్రసాదరావు, ఒ.భాస్కరరావు పాల్గొన్నారు.