
మా కుమార్తెను హత్య చేసిన వారిని శిక్షించాలి
- మృతదేహంతో ధర్నా
బద్వేలు అర్బన్: తమ ఒక్కగానొక్క కూతురిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు లక్ష్మిపాళెంలోని మృతురాలి భర్త ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. బద్వేలు మండలం పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన వీరయ్య, వెంకటసుబ్బమ్మల మొదటి సంతానమైన చంద్రకళ ను లక్ష్మిపాళెం గ్రామానికి చెందిన సంపతి వెంకటసుబ్బయ్యకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. రెండేళ్లుగా వెంకటసుబ్బయ్య మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యతో గొడవకు దిగడంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి మంగళవారం రాత్రి పెద్ద చెరువులో శవమై కనిపించింది.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా లక్ష్మిపాళెంలోని మృతురాలి భర్త వెంకటసుబ్బయ్య ఇంటి వద్దకు తెచ్చి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. తమ కుమార్తెను భర్త, అత్తమామలే అంతమొందించి చెరువులో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. విషయం తెలుసుకున్న బద్వేలు సీఐ రామాంజినాయక్ అర్బన్, రూరల్ ఎస్‌ఐలు నాగమురళి, నరసింహారెడ్డిలు సిబ్బందితో సంఘట నా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులు , బంధువులతో చర్చించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.