ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న పైలాన్ చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. అనితర సాధ్యం.. అనన్య సామాన్యంఅన్న రీతిలో ఇప్పటికి 3,593.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన వైఎస్ జగన్.. ఈ నెల 9న తన ప్రజా సంకల్ప యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య ఈ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత.. 2019 జనవరి 9వ తేదీ నాటికి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ‘ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం’ వరకూ నడుస్తూ లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ భవిష్యత్తుపై వారికి భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పైలాన్ నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూనుకుంది.
ఆకర్షణీయంగా..
ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో.. యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్ పనులు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరో వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించనుంది. ఈ పైలాన్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలు, జగన్ పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను నిబీడీకృతం చేయనున్నారు.
13 జిల్లాలకు గుర్తుగా.. 13 మెట్లు
పైలాన్ చుట్టూ చిన్నపాటి లాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాన్ నుంచి పైలాన్ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందున ఒక్కో జిల్లాకు చిహ్నంగా ఒక్కో మెట్టును ఏర్పాటు చేశారు. ఇక పైభాగాన వైఎస్సార్ కాంగ్రెస్ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు. నిర్మాణం అగ్రభాగాన పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్ జగన్ నడిచారో తెలియజేస్తూ ఒక మ్యాప్‌ను కూడా ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నో దర్శనీయ స్థలంగా, ఆకర్షణీయమైనదిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో రెడీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు గర్వించేలా.. వారిలో స్ఫూర్తిని నింపేలా.. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, సంకల్పానికి చిహ్నంగా నిర్మిస్తున్న ఈ పైలాన్ మరో రెండు రోజుల్లో దాదాపుగా పూర్తవుతుందని ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను తొలి నుంచీ పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ చెప్పారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక మెరుగులు దిద్దే పని ఉందన్నారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కఠోర దీక్షతో తన సంకల్పాన్ని పూర్తి చేశారని.. ఇది పార్టీలో అందరికీ గర్వకారణమన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికే అడుగు పెట్టిన జగన్.. కొర్లాం, బారువ క్రాస్, సోంపేట, కవిటి, రాజపురం, కొజ్జీరియా మీదుగా పాదయాత్ర సాగిస్తూ ఇచ్ఛాపురం చేరుకుంటారని తెలిపారు. ఈ నెల 9న పైలాన్‌ను ఆవిష్కరించాక ఇచ్ఛాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తలశిల రఘురామ్ వివరించారు.
విజయ 'సంకల్పం'
Published Fri, Jan 4 2019 2:18 AM | Last Updated on Fri, Jan 4 2019 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment