గోరంట్ల, న్యూస్‌లైన్ : గోరంట్ల మండలం వానవోలులో ఓ కొండచిలువ గొర్రెను మింగడానికి విఫలయత్నం చేసింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. వానవోలుకు చెందిన గాండ్ల క్రిష్టప్ప గురువారం మేత కోసం తన గొర్రెల మందను గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం గొర్రెలను ఇంటికి తోలుకొచ్చే సమయంలో ఓ గొర్రెను పది అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుకొని పొదల్లోకి వెళ్లింది. వెంటనే క్రిష్టప్ప ఇంటికి వచ్చి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వెళ్లి వెతికారు. చీకట్లో కన్పించకపోవడంతో వెనుదిరిగారు.
శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో వెతికారు. అయినా కొండచిలువ జాడ కన్పించలేదు. శనివారం మధ్యాహ్నం దానిని గమనించిన పశువుల కాపరులు గ్రామస్తులకు తెలిపారు. ఆ కొండచిలువను చూడడానికి ప్రజలు భారీగా తరలి వెళ్లారు. రెండు రోజులుగా గొర్రెను మింగడానికి కొండ చిలువ తీవ్ర ప్రయత్నం చేసింది. తుదకు వీలుకాక శనివారం సాయంత్రం దానిని బయటకు వదిలేయడానికి యత్నిస్తుండగా ఓ గ్రామస్తుడు సహకరించాడు. కొద్ది సేపటి తర్వాత మృతి చెందిన గొర్రెను వదిలేసి.. కొండచిలువ పొదల్లోకి వెళ్లిపోయింది. గ్రామస్తులు దానికి ఎలాంటి హాని తలపెట్టలేదు.
మింగలేక.. కక్కలేక..
Published Sun, Dec 8 2013 4:15 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement