
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగాలు
అమరావతి: ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రసంగాలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఘనత తమదేనని అధికారపక్షం సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే పోలవరంపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం కూడా విజ్ఞప్తి చేసింది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యయం పెరిగిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం అయితే ఈ పాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా భూ సేకరణ కష్టతరం అయ్యిందన్నారు.
పోలవరం ఏడు దశాబ్దాల కల..
ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ...‘పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏడుదశాబ్దాల కల. ప్రాజెక్ట్ పూర్తయిన రోజు ఏపీలో ఏ మూల కూడా కరువు అనేది ఉండదు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్. గత ప్రభుత్వాలు మట్టిపనులు చేయడానికి తాపత్రయపడ్డారు తప్ప, పోలవరం నిర్మించాలనే ఆలోచనే చేయలేదు.’ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. రాయలసీమ భవిష్యత్‌ను మార్చే పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
కరువురహిత రాష్ట్రంగా ఏపీ..
కాగా ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చంద్రబాబు కృషి చేశారని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. పోలవరంతో ఏపీ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు.