వాళ్లంతే!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 15 నుంచి నిర్వహించే అర్ధ సంవత్సర పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ పెద్ద సమస్యగా మారింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలులో భాగంగా పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు ముద్రణ ఉండకూడదు. ఆయా స్కూళ్లలో సబ్జెక్టు నిపుణులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాటితో పరీక్షలు నిర్వహించాలి. 1-10 తరగతులకు పాఠశాల స్థాయిలో ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలని ఎస్పీడీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో కొందరు హెచ్‌ఎంలు ఈ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఏళ్ల తరబడి అలవాటుపడ్డ ఉపాధ్యాయులు ఇప్పుడు స్వయంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకోడానికి అయిష్టత చూపుతున్నారు.
ఇదే సందర్భంలో కొందరు ఆఫ్‌సెట్ ప్రింటర్ల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పెరిగిన టెక్నాలజినీ ఉపయోగించుకుని ఎవరికీ అనుమానం రాకుండా ముద్రణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా స్కూళ్ల హెచ్‌ఎంల నుంచి ఇండెంట్ తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రం తయారు చేసి బ్లాక్ బాల్ పారుుంట్ పెన్నుతో తెల్లటి కాగితంపై రాసి స్కానింగ్ చేస్తారు. ఆ కాగితాన్ని ఆఫ్‌సెట్ ప్రింట్ యజమానులకు చేరవేస్తున్నారు. తద్వారా జిల్లా అంతటా ప్రశ్నపత్రం ఒకే మాదిరి ఉండకూడదనే నిబంధనకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు సాధారణ రీతిలోనే ఉండబోతున్నాయి. అయితే సదరు ఆఫ్‌సెట్ ప్రింటర్లకు విద్యాశాఖలో ఓ ఉద్యోగి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరం వెనుక డబ్బు చేతులు మారినట్లు తెలిసింది.
ఒక్కో సెట్టు రూ. 3-5
జిల్లాలో 3,992 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. ఆయూ స్కూళ్లలో 4,13,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలోని ఆఫ్‌సెట్ ప్రింటర్ల యజమానులు ఇద్దరు ప్రశ్నపత్రాల తయారీకి ధర ఫిక్స్ చేశారు. 6,7,8 తరగతులకు సంబంధించి ఒక్కో సెట్టు 3 రూపాయలు, 9,10 తరగతులకు సంబంధించి ఒక్కో సెట్టు రూ.5గా ధర నిర్ణయించారు. ఈ మేరకు స్వయంగా ప్రధానోపాధ్యాయులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలు తయారు చేయాలన్నా, బోర్డుమీద రాయాలన్నా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. విద్యా శాఖ ఉద్యోగి పర్సేంటేజీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వైనంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించక పోవడం దారుణం అని ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అలా చేస్తే ఇబ్బంది పడతారు
అర్ధ సంవత్సర పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ విషయమై చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరి స్కూల్‌లో వారే తయారు చేసుకోవాలి. వారి వీలును బట్టి జిరాక్స్ చేయించుకోవచ్చు లేదా బోర్డుపై రాసుకోవచ్చు. అంతేకాని ఎక్కడైనా ముద్రించినట్లు తెలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయంలో ఎస్పీడీ ఉషారాణి చాలా సీరియస్‌గా ఉన్నారు. పరీక్షల సమయంలో వివిధ పాఠశాలలు తనిఖీ చేస్తాం. ఎక్కడైనా ముద్రించిన ప్రశ్నపత్రాలు కాని, వివిధ స్కూళ్లలో కామన్‌గా ఉన్నట్లుకాని తేలితే చర్యలు తీసుకుంటాం.
- అంజయ్య, డీఈఓ