సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయరాదని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు షరతులు విధించారు.
కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, న్యాయస్థానం విధించిన షరతులను వారు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని, ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్‌కు అర్హులేనని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్ ఉత్తర్వులు వెలువరించే సమయానికి కోర్టు సమయం ముగియడంతో...పూచీకత్తు బాండ్లను వీరిద్దరి తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 17 నెలల జైలు జీవితం తర్వాత వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్
Published Tue, Oct 8 2013 1:32 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
Advertisement