నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ ప్రాజెక్టు, ఇందూటెక్ భూముల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిమ్మగడ్డ నిందితునిగా ఉన్నారు. ఈ కేసుల్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జరుపుతున్న విచారణకు ప్రతి శుక్రవారం కోర్టు ముందు ఆయన హాజరు కావాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వ్యక్తిగత విచారణ నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
బ్రహ్మానందరెడ్డికి సైతం...
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డికి సైతం హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. అలాగే ఈ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మూడు నెలల్లోపు పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు.
వాన్‌పిక్ పోర్ట్స్‌తో అవగాహన ఒప్పందం విషయంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని తనపై సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టేయాలని, అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్‌కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ, వాన్‌పిక్ పోర్ట్స్ వ్యవహారంలో పిటిషనర్ సొంత నిర్ణయాలేవీ లేవని, మంత్రి మండలి నిర్ణయాలను మౌలిక వసతుల ప్రత్యేక కార్యదర్శిగా అమలు చేశారని వివరించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదని, ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ పిటిషనర్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై తీవ్రజాప్యం జరుగుతోందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి బ్రహ్మానందరెడ్డికి మినహాయింపునిచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్‌ను మూణ్నెల్లలో పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించారు. సీబీఐకి నోటీసు కౌంటర్ దాఖలు చేయాలన్నారు.