kv brahmananda reddy
-
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ ప్రాజెక్టు, ఇందూటెక్ భూముల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిమ్మగడ్డ నిందితునిగా ఉన్నారు. ఈ కేసుల్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జరుపుతున్న విచారణకు ప్రతి శుక్రవారం కోర్టు ముందు ఆయన హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వ్యక్తిగత విచారణ నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మానందరెడ్డికి సైతం... జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డికి సైతం హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. అలాగే ఈ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మూడు నెలల్లోపు పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ పోర్ట్స్‌తో అవగాహన ఒప్పందం విషయంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని తనపై సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టేయాలని, అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్‌కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ, వాన్‌పిక్ పోర్ట్స్ వ్యవహారంలో పిటిషనర్ సొంత నిర్ణయాలేవీ లేవని, మంత్రి మండలి నిర్ణయాలను మౌలిక వసతుల ప్రత్యేక కార్యదర్శిగా అమలు చేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదని, ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ పిటిషనర్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై తీవ్రజాప్యం జరుగుతోందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి బ్రహ్మానందరెడ్డికి మినహాయింపునిచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్‌ను మూణ్నెల్లలో పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించారు. సీబీఐకి నోటీసు కౌంటర్ దాఖలు చేయాలన్నారు. -
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయరాదని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు షరతులు విధించారు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, న్యాయస్థానం విధించిన షరతులను వారు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని, ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్‌కు అర్హులేనని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్ ఉత్తర్వులు వెలువరించే సమయానికి కోర్టు సమయం ముగియడంతో...పూచీకత్తు బాండ్లను వీరిద్దరి తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 17 నెలల జైలు జీవితం తర్వాత వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. -
నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 3కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితుడైన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం విజ్ఞప్తి చేశారు. దీనిపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఎస్పీ చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నారని, అయినా కౌంటర్ దాఖలుకు గడువు కోరడం భావ్యం కాదని తెలిపారు. వాన్‌పిక్ అంశంపై మాత్రమే దర్యాప్తు చేసిన అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వారు హైదరాబాద్‌కు రావడానికి కొంత సమయం పడుతుందని.. అందుకే గడువు కోరుతున్నామని సురేంద్ర నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి విచారణను 3కు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయడంతోపాటు అదే రోజు వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
బెయిల్ ఇవ్వండి.. ప్రత్యేక కోర్టులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరఫున న్యాయవాదులు మంగళవారం ప్రత్యేక కోర్టులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు 16 నెలలకుపైగా తాము రిమాండ్‌లో ఉన్నామని, ఈ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగా గతంలో తమ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యిందంటూ సీబీఐ తాజాగా మెమో దాఖలు చేసిన నేపథ్యంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించామని, తదుపరి విచారణకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని నివేదించారు. వీరి పిటిషన్లను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించారు. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. 16 నెలలుగా రిమాండులో: నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ... గత ఏడాది ఆగస్టు 13న చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంకా దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న సీబీఐ అభ్యంతరంతో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు పూర్తయ్యాక బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. -
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబరు 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ.ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా...సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, మన్మోహన్సింగ్, శ్యామూల్, శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.