సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరఫున న్యాయవాదులు మంగళవారం ప్రత్యేక కోర్టులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు 16 నెలలకుపైగా తాము రిమాండ్‌లో ఉన్నామని, ఈ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగా గతంలో తమ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యిందంటూ సీబీఐ తాజాగా మెమో దాఖలు చేసిన నేపథ్యంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించామని, తదుపరి విచారణకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని నివేదించారు. వీరి పిటిషన్‌లను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించారు. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.
16 నెలలుగా రిమాండులో: నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ... గత ఏడాది ఆగస్టు 13న చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంకా దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న సీబీఐ అభ్యంతరంతో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు పూర్తయ్యాక బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.
బెయిల్ ఇవ్వండి.. ప్రత్యేక కోర్టులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి పిటిషన్లు
Published Wed, Sep 25 2013 1:53 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement
Advertisement