జగన్ బెయిల్‌పై చంద్రబాబు అక్కసు
దానిపై కోర్టుల్లో పోరాడతాం
కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ మ్యాచ్ ఫిక్సింగ్
ఆగమేఘాలపై కేసును నిర్వీర్యం చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ లభించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. వాటిని వదిలిపెట్టబోమన్నారు. ‘ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం. న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చార్జిషీట్లన్నీ వేశాక బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు చెబితే ఇంకా రెండు చార్జిషీట్లు వేయాల్సి ఉండగానే బెయిల్ పిటిషన్ వేశారని ఆరోపించారు. అయినా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లలేదంటూ వాపోయారు. సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని మండిపడ్డారు.
కేసు విచారణ చేస్తున్న జేడీ సహా మరో అధికారిని బదిలీ చేశారని, ఆగమేఘాలపై కేసులను నిర్వీర్యం చేశారని అన్నారు. జగన్ కేసులో 16 నెలల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఈడీని డిమాండ్ చేశామని బాబు అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ కుదరడంతో సీబీఐ సరైన న్యాయవాదిని పెట్టలేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఎ2, ఎ3, ఎ4లకు బెయిల్ రాకుండా జగన్‌కెలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీలో రాసిన స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్నారు. జగన్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి’’ అని డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామే తప్ప వ్యక్తులపై కాదని చెప్పుకొచ్చారు. జగన్ బెయిల్‌ను అడ్డుకోవడానికి తాను రాహుల్‌గాంధీని కలిసినట్టు ‘సాక్షి’ టీవీ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇక నుంచి కాంగ్రెస్‌కు మూడు కార్యాలయాలు ఉంటాయని, అందులో ఒకటి బ్రాంచి కార్యాలయమని ఎద్దేవా చేశారు. తృతీయ ఫ్రంట్, ఎన్డీఏలలో చేరికపై ప్రశ్నించగా, సరైన సమయంలో సమాధానం ఇస్తానని బాబు చెప్పారు.