వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీ వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
* పార్టీలకు ఆర్.కృష్ణయ్య డిమాండ్
* రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి బీసీలకేనని ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీ వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని, విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి పదవి బీసీలకే ఇస్తామని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో బీసీల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 96 కులసంఘాలు, 45 బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతంగా ఉన్నప్పటికీ గత 60 ఏళ్లలో ఒక్క బీసీ కూడా సీఎం కాలేకపోయారని ఆవేదన వెలిబుచ్చారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు.
విభజన నేపథ్యంలో 2 రాష్ట్రాల్లోనూ బీసీలకే అధికారం కట్టబెట్టాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జు కృష్ణ, యెగ్గం మల్లేశం, పెరిక సురేష్, పావులూరి హన్మంతరావు, ర్యాగ రమేష్, ఎ.రాంకోటి, ఎ.ఎల్.మల్లయ్య, వేముల వెంకటేశ్, గణేష్ చారి, కోల శ్రీనివాస్, శారద తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అవి...
* వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తెలంగాణలో 60 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలను బీసీలకు కేటాయించాలి
* సీమాంధ్రలో 90 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలు కేటాయించాలి
* బీసీ రాజకీయ పాలసీని అన్ని పార్టీలూ ప్రకటించాలి
* పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగసవరణ జరగాలి
* రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ తేవాలి
* పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి