తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్‌లైన్ :
పేదలను ఆదుకునేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రచ్చబండ ఏర్పా ట్లు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల తీరుపై తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షిం చారు. ఈ నెల 11వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్న మూడో విడత రచ్చబండలో జిల్లాలోని 2 లక్షల మంది పేదలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 81 వేల మంది పేదలకు రేషన్ కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 36వేల 549 వృద్ధాప్య, వితంతు, 5వేల 716 మంది వికలాంగులకు పింఛన్లు జారీ చేస్తామని చెప్పారు. 20 నుంచి 30 శాతం వరకూ అంగవైకల్యం కలిగిన వారికి రూ.200 చొప్పున అందిస్తామన్నారు. ఇప్పటివరకూ ఈ కేటగిరి కింద 34వేల 558 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
31వేల 965 మంది పేదలకు శాశ్వత గృహ నిర్మాణపథకం కింద ఇళ్ల మంజూరు ఉత్తర్వులను అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివసిస్తూ నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 15వేల 455 మంది ఎస్సీలకు రూ.2.42 కోట్లు, 2వేల 399 మంది ఎస్టీలకు రూ.18 లక్షల విద్యుత్ రాయితీ సొమ్ము అందిస్తామని చెప్పారు. రచ్చబండ లబ్ధిదారుల జాబితాలన్నీ ఈ నెల 10 నాటికి సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పంట నష్టాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఖరీఫ్ పంట కాలంలో 12.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావించామని, వరదలు, వర్షాలతో 80 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గవచ్చని వివరించారు. రంగుమారిన ధాన్యం కొనుగోలుచేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు.
శాఖల వారీగా జరిగిన నష్టాల నివేదికను మంత్రి కన్నాకు సమర్పించారు. సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలినాని, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.బాబూరావునాయుడు, ఉద్యాన వర్శిటీ అధికారి శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాసు, ప్రణాళికా విభాగం జేడీ కె.సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావు, డీఎస్‌వో డి.శివశంకర్ రెడ్డి, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏడీ ఎస్.సుజాత పాల్గొన్నారు.
పేదల్ని ఆదుకునేందుకే రచ్చబండ : మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
Published Sat, Nov 9 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement