చంద్రబాబు.. చేతకాని దద్దమ్మ
కాకినాడ :విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఆర్థిక పరిస్థితి పేరుతో ప్రజలపై పన్నుల భారం వేస్తే కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సాధనకు కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో శనివారం కాకినాడ జగన్నాథపురంలో కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు సంతకంతో ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రత్యేక హోదాతోపాటు అనేక అంశాలను పక్కనపెట్టిందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ హామీల అమలుకు ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. పోలవరానికి వచ్చే బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించడంతోపాటు ఇతర డిమాండ్లపై తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టిందన్నారు. ఈనెల 23న ఈ సంతకాలతో ప్రధానిని కలుస్తామని, అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేస్తామని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అవసరమైతే చంద్రబాబు ముక్కుపిండి, చొక్కా పట్టుకుని నిలదీస్తామని హెచ్చరించారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, పళ్లంరాజు చంద్రబాబు తీరును విమర్శించారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనకు ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా రఘువీరా, బొత్సలను కలిసి కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపి సంతకం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎ.జె.వి.బి.మహేశ్వరరావు, పార్టీ నేతలు బోనం భాస్కర్, పంతం నానాజీ, మార్టిన్ లూథర్, ఎస్సీ సెల్ నాయకులు వర్ధినీడి సుజాత, వర్ధనపు వీర్రాజు, తనికెళ్ల సూర్యనారాయణ, నగర అధ్యక్షుడు కంపర రమేష్, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ ఆకుల వెంకటరమణ, పార్టీ నేతలు పంతం నెహ్రూ, పంతం ఇందిర తదితరులు పాల్గొన్నారు.