విజయవాడ : రాష్ట్రంలో కరువు తాండవిస్తున్న నేపధ్యంలో కరువును అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు కరువు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఓ బృందం, రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరో బృందం పర్యటిస్తుందన్నారు. కరువుపై గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కరువును ఎదుర్కోవడంలో విఫలమైన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాడాలని అన్నారు. నేను నెంబర్ వన్ కూలీ అని చెబుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో కరువు తాళలేక వలస బాట పట్టిన 20 లక్షల మంది కూలీలకు ప్రతినిధా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసినా.. జాగ్రత్త తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో గుక్కెడు మంచి నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరువు సహాయ నిధికి 40 కోట్లు విడుదల చేశారని, అవి ఏ మూలకు వస్తాయని ప్రశ్నించారు. కేవలం టీడీపీ కార్యకర్తల జేబులు నింపేందుకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం దయనీయ స్థితిలో కొనపాగుతుందని, దళారుల పాత్ర ఎక్కువైపోయిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఉపాధిహామీ పథకంలో 5000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకంలో జరుగుతున్న అవినీతిపై ఈ నెల 16 వ తేదీన వామపక్షాలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
'చంద్రబాబు వారికి ప్రతినిధా?'
Published Tue, May 3 2016 8:38 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement