కరవు మండలాలు ప్రకటిస్తే సరిపోదు
సాక్షి, అమరావతి: కరవు మండలాలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని.. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల పేరిట పీసీసీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం పెద్ద ఎత్తున రైతు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామన్నారు.
అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ పేరుతో కోట్లాది రూపాయల ఖర్చు చేసి లక్షలాది ఎకరాల పంటను కాపాడినట్లు ప్రచారం చేసుకున్న ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రెయిన్ గన్స్ పేరిట ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాన్ని త్వరలో రైతులే నిలదీస్తారన్నారు. కోడుమూరులో నిర్వహించే రైతు సభ ద్వారా.. రైతులకు మనోధైర్యం నింపడంతో పాటు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.