26 మండలాల్లోనే కరువు!
తేల్చిన అధికారులు
- ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు 36
- 10 మండలాల్లో ఆ ఛాయలు లేవంటున్న అధికార యంత్రాంగం
- రూ.327.08 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి నివేదిక
- 2,51,578.50 హెక్టార్లలో పంట నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కేవలం 26 మండలాల్లోనే కరువు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా 10 మండలాల్లో పంటలు బాగా పండాయని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, గోస్పాడు, శిరువెల్ల, కొత్తపల్లి, బండిఆత్మకూరు మండలాల్లో కరువు లేదని రిపోర్టు ఇవ్వడంతో ఎన్యూమరేషన్ జరుగలేదు. దీంతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీకి దూరమయ్యారు. 26 మండలాల రైతులకే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు జిల్లా యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. 26 మండలాల్లో ఎన్యూమరేషన్ పూర్తయింది. ఇన్‌పుట్ సబ్సిడీకి తుది జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 3,08,455 మంది రైతులు 2,51,578.50 హెక్టార్లలో వివిధ పంటలను కోల్పోయారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.327కోట్ల విడుదలకు జిల్లా యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ ద్వారా ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.