'బాబు.. ఎమ్మెల్యేల కరువు తీర్చుకుంటున్నారు' | YSRCP Leader Parthasarathi press meet | Sakshi
Sakshi News home page

'బాబు.. ఎమ్మెల్యేల కరువు తీర్చుకుంటున్నారు'

Published Fri, Apr 29 2016 6:25 PM | Last Updated on Tue, May 29 2018 2:48 PM

YSRCP Leader Parthasarathi press meet

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటన
-మాచర్ల ధర్నాలో పాల్గొననున్న జగన్‌మోహన్‌ రెడ్డి
-ప్రజల కరువు పట్టడం లేదుగానీ, బాబుకొచ్చిన ఎమ్మెల్యేల కరువును మాత్రం తీర్చుకుంటున్నారు
-బాబొస్తే జాబు రాలేదు గానీ కరువొచ్చింది


హైదరాబాద్
: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పట్టనట్టే వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రకటించారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

'రాష్ట్రంలో ప్రజలు కరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు వేరే రకమైన కరువు వచ్చినట్టు.. రోజూ ఎంత మంది ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చారో లెక్క చూసుకొని సంతోషపడుతున్నారే గానీ, కరువు దెబ్బకు ఎన్ని ప్రాణాలు పోతున్నాయో పట్టడం లేదు. పశుగ్రాసం, నీటి కొరతతో రోజూ ఎన్ని పశువులు చనిపోతున్నాయో కూడా విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తీవ్ర సమస్యలను పక్కదారి పట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు' అని  పార్ధసారధి దుయ్యబట్టారు. వేసవిలో వచ్చే కరువును ఎలా ఎదుర్కొవాలన్నదానిపై మార్చి నెలలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు సర్కారు ఏప్రిల్ ఆఖరులోనూ ప్రజల సమస్యల పరిష్కరానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోకపోవడం శోచనీయమన్నారు.

కలల విహారం
ప్రజలను కలలో విహరింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది గానీ, వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్కారు వద్ద ఒక విధానం అంటూ లేదని దుయ్యబట్టారు. 'నిన్ననే అధికార పార్టీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తారని చెబుతున్నారు. చాలా సంతోషం. కానీ, ఈ రోజు కరువును ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు అనంతపురం జిల్లాలో తాగునీటి లేక ప్రజలు, పశువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారో ఆ ఎంపీ మాత్రం మాట్లాడలేదు' అని పార్ధసారధి గుర్తు చేశారు.

పట్టిసీమ కట్టాం, కష్ణా జిల్లాలో నీటికి ఎటువంటి సమస్య ఉండదంటారు. కానీ, కష్ణా నది ఎండిపోతే ఇపుడు అక్కడి ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య తీర్చాలన్న దానిపై ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక లేదని విమర్శించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కరువు ప్రాంతాల్లో పంపిణీ చేశారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షం ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి.. ఫిరాయింపులను పోత్సహించడానికి పరిమితమైంది తప్పితే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. బాబొస్తే జాబులు రాలేదుగానీ, కరువు, వర్షాలు లేని వాతావరణం మాత్రం చూస్తున్నామన్నారు.

జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న, అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని ప్రతిపక్ష నేతగా ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి వివరించడం తప్పు ఎలా అవుతుందని టీడీపీ నేతల విమర్శలకు పార్థసారధి బదులిచ్చారు. గతంలో చంద్రబాబుపై కూడా కేసులున్నాయని, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిని, రాజ్యాంగ ఉల్లంఘలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఫలీకతమైందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

పార్టీ వీడి వెళ్లేటప్పుడు తక్కినవారు చేసే విమర్శల లాంటివే మైసూరారెడ్డి కూడా చేశారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. అధినేత వైఖరి నచ్చక పార్టీ మారుతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. ఎన్నికలు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయమని జగన్‌ మోహన్‌ రెడ్డి అడగడం వారికి నచ్చలేదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement