16న ‘బైసన్ పోలో’ వద్ద ధర్నా!
కోదండరాంను ఆహ్వానించిన వైఎస్సార్సీపీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ వద్ద ఈ నెల 16న చేపట్టనున్న ధర్నాకు హాజరుకావాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు గురువారం వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు మతిన్ ముజ్దాదిన్, కె.శివకుమార్, కార్యదర్శి అవినాష్ గౌడ్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి హైదరాబాద్ తార్నాకలోని కోదండరాం నివాసంలో ఆయనను కలిశారు.
ధర్నాకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ ఆధునిక హంగులతో ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరుతో పక్కన పెట్టి బైసన్ పోలో గ్రౌండ్లో నూతన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడం శోచనీయమని అన్నారు. ధర్నాను విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు.