చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు పైస్థాయిలో దోచుకుంటుంటే క్యాడర్ కింది స్థాయిలో చిల్లర దోపిడీలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. హుదూద్ తుఫాను సందర్భంగా పంపిణీ చేసిన సరుకుల అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని రఘువీరా శనివారమిక్కడ డిమాండ్ చేశారు. తుపాను బాధితులను ఆదుకునే నెపంతో ఉన్న రేషన్ కార్డులకు అదనంగా 2 లక్షల రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులు కట్టబెట్టారని ఆయన విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి 88కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడాన్ని రఘువీరా తప్పుబట్టారు. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం కోరితే సగం మాత్రమే ఇచ్చారన్నారు. ఈ ఫైళ్లను అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించాలని రఘువీరా డిమాండ్ చేశారు.. అధికారులు వద్దన్నా.. మంత్రి దేవినేని సిఫార్సుతో అడ్వాన్స్ ఇచ్చారని ఆయన అన్నారు.