'టీడీపీ, బీజేపీ వాళ్లంతా గాడ్సే వారసులే'
హైదరాబాద్: భారత జాతిపిత గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోమవారం హైదరాబాద్లో ఆరోపించారు. అయితే ఆ శక్తుల ప్రయత్నాన్ని టీడీపీ, బీజేపీలు వ్యతిరేకించడం లేదని విమర్శించారు. నెహ్రుని కూడా గాడ్సే చంపి ఉండాల్సిందని ... కానీ ఆయన పొరపాటు చేశారని బీజేపీ చెబుతుందని గుర్తు చేశారు.టీడీపీ, బీజేపీల్లో ఉన్నవారు గాడ్సే వారసులని ఎద్దేవా చేశారు.
దేశాన్ని ముస్లిం, క్రిస్టియన్ రహిత భారత్గా మలచాలని బీజేపీ చూస్తోందని అన్నారు. రాజధాని నిర్మాణం చేస్తున్న గ్రామాల్లో అరాచకం చోటు చేసుకోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని 24 గంటల్లోపు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని... అలాగే రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు రక్షణ కల్పించాలని రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.