'నందిగామ ఉప ఎన్నిక ... టీడీపీకి ఓ హెచ్చరిక'
విజయవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై టీడీపీ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్ని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజూకు విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు.
నందిగామ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీకి 2 వేల నుంచి 24 వేల ఓట్లు పెరిగాయని అన్నారు. ఇది టీడీపీకి ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనున్న జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పథకాలన్నింటికీ ప్రభుతం ఆధార్తో లింకు చేస్తోందని.... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు తగ్గిస్తే ఊరుకోమని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్యలతోపాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.