హైదరాబాద్ : ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు అనుసరిస్తున్న మెతక వైఖరిపై ఏపీ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. మీ లొంగుబాటు వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టమని చంద్రబాబుకు రఘువీరా సూచించారు. పోరాడితే పోయేదేమీలేదు... ప్రత్యేక హోదా అమలుచేయించుకోవడం తప్ప అంటూ చంద్రబాబుకు రఘవీరా చురకలంటించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయవద్దని... రాజీదోరణి అనుసరించాలంటూ టీడీపీ యంత్రాంగానికి బాబు ఆదేశించడాన్ని రఘవీరా తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల తమ స్వార్థప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టడమేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హోదా తమ హక్కు అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని... గత 20 నెలలుగా ఈ అంశాన్ని సాగదీస్తున్నందను వారంతా కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిని వ్యతిరేకించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే టీడీపీ రాజకీయ దివాళాకోరు విధానాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు రఘవీరా సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని.. గత యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్డీయేదే అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీకి బాబు మోకరిల్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేసిందని.. అలాగే 10 ఏళ్లు కాదు.... 15 ఏళ్లు కావాలని చంద్రబాబు డిమాండ్ చేశారని రఘువీరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ అధికారంలోని రాగానే నరేంద్రమోదీ రాష్ట్రాన్ని మోసం చేస్తూ వస్తున్నారన్నారు.
నరేంద్రమోదీ మోసంలో చంద్రబాబు భాగస్వామి అవున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అని అభివర్ణించారు. పునర్వవస్థీకరణ చట్టంలో చట్టబద్దం చేసిన అంశాలను కూడా మోదీ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు... పైగా రాష్ట్రానికి చాలా సహాయం చేశామని లెక్కలు చెబుతున్నారని రఘువీరా తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏ మేరకు సాయం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘువీరా శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు.