విద్యార్థినిని మింగేసిన ర్యాగింగ్ భూతం | Raging devil | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని మింగేసిన ర్యాగింగ్ భూతం

Published Wed, Jul 15 2015 1:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

రిషికేశ్వరి (ఫైల్ ఫోటో) - Sakshi

రిషికేశ్వరి (ఫైల్ ఫోటో)

తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో

ఏఎన్‌యూ :  తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రథమ సంవత్సరం విద్యార్థిని మొండి రిషికేశ్వరి (18) మంగళవారం వర్సిటీ వసతి గృహంలో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది.  ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్‌లో ఆమెపై తోటి విద్యార్థులు చేసిన ఆరోపణలు, వేధింపులు, వర్సిటీలో ర్యాగింగ్ భూతాన్ని ప్రస్ఫుటం చేశాయి. సీనియర్ విద్యార్థుల వేధింపులు, అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు అర్థమవుతుంది. తన అవయవాలను దానం చేయాలని నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది ఆ విద్యార్థిని ఔన్నత్యానికి నిదర్శనమని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. రిషికేశ్వరి మృతదేహాన్ని చూసిన తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 చదువులో ముందే..
 రుషికేశ్వరి చదువులో మెరిట్ విద్యార్థినిగా కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థినులు చెబుతున్నారు. బీఆర్క్ మొదటి సెమిస్టర్‌లో 1200 మార్కులకు 799 మార్కులు సాధించింది. చదువులో చురుగ్గా, మిత్రులతో చలాకీగా ఉండేదని పేర్కొన్నారు. కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి బాధపడేదని తెలిసింది. తన బిడ్డ పరిస్థితి తెలుసుకున్న తండ్రి పది రోజుల క్రితం యూనివర్సిటీకి వచ్చి రుషి కేశ్వరికి నచ్చజెప్పి, కళాశాల అధికారులతో మాట్లాడి వె ళ్లారని సిబ్బంది పేర్కొన్నారు.

 బోరున విలపించిన తండ్రి ...
వరంగల్ నుంచి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసిన రిషికేశ్వరి తండ్రి మురళీకృష్ణ బోరున విలపించారు. ఒకే ఒక సంతానమైన తన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తె తనతో సంభాషించిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోయారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావు తదితరులు ఓదార్చేందుకు ప్రయత్నించారు.

 నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు...  విద్యార్థిని మృతిపై వాస్తవాలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివ రావు మంగళవారం సాయంత్రం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన అనంతరం యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యూనివర్సిటీ బాలుర, బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్లు, విద్యార్థినుల ప్రతినిధులుగా వి. జ్యోతి ( జర్నలిజం), కె. నిర్మల (పరిశోధకురాలు), డాక్టర్ కె. వీరయ్య (జువాలజీ), డాక్టర్ జిమ్మీరాణి ( యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్)తో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇస్తుందని తెలిపారు.

 కొవ్వొత్తుల ర్యాలీ .. విద్యార్థిని మృతికి సంతాపసూచకంగా, ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి విద్యార్థినీవిద్యార్థులు యూనివర్సిటీలో కొవొత్తుల ర్యాలీ చేశారు. తొలుత ఇండోర్ స్టేడియం వద్ద మౌనం పాటించి విద్యార్థిని మృతికి నివాళులర్పించారు. ఆమ  ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ర్యాలీలో ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ డెరైక్టర్ ఆచార్య పి. శంకర పిచ్చయ్య, న్యాయవాది వై. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement